దీపావళి, హోళీ ఒకేసారి!
♦ కోవింద్ గెలుపుతో అభిమానుల సంబరాలు
♦ పండుగ శోభను సంతరించుకున్న రామ్‌నాథ్ నివాసాలు
♦ టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్న కళ్యాణ్‌పూర్ ప్రజలు
కాన్పూర్/న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికైన వెంటనే ఆయన స్వస్థలం కాన్పూర్ దెహత్ జిల్లాలోని స్వగ్రామం, ఢిల్లీ, కాన్పూర్ నగరాల్లోని నివా సాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ శివార్లలో ఉన్న కళ్యాణ్‌పూర్‌లోని కోవింద్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి మహర్షి దయానంద్ విహార్ కాలనీ ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, మిఠా యిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకు న్నారు. ‘మాకు దసరా, దీపావళి, హోలీ పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉంది’ అని ఓ స్థానికుడు ఉత్సాహంగా చెప్పాడు. ‘ఓట్ల లెక్కింపు మొదలవ్వక ముందే మేం సంబరా లు ప్రారంభించాం.
కోవింద్ గెలుస్తారన్న విషయం ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిననాడే మాకు తెలుసు. మా వార్డులో నివసించే వ్యక్తి రాష్ట్రపతి అని తలచుకుంటేనే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోంది’ అని స్థానిక కార్పొరేటర్ అన్నారు. కాన్పూర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ అధికారులు వేడుకలు నిర్వహించారు. శుభా కాంక్షలు చెప్పేందుకు ఉదయంనుంచే కళ్యాణ్ పూర్‌లోని ఇంటి వద్దకు జనాలు చేరుకోవడం ప్రారంభించారు. ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే ఆ ప్రాంత మంతా టపాసుల ధ్వనులతో మార్మోగింది. సరిత అనే మహిళ మాట్లాడుతూ ‘కోవింద్ కుటుంబంతో మాకు మంచి బంధం ఉంది. జీవితంలో ముందుకు సాగేలా ఆయన ఎన్నోసార్లు మాకు ప్రేరణనిచ్చారు’ అని చెప్పారు.
కోవింద్ చదువుకున్న డీఏవీ కళాశాల ప్రిన్సిపాల్ అమిత్ మాట్లాడుతూ ‘మా పూర్వ విద్యార్థి ఒకరు ఇప్పుడు భారత రాజ్యాంగ అత్యున్నత పదవిని అధిష్టించనుం డటం మాకు గర్వంగా ఉంది. 2019లో జరిగే మా కాలేజీ శతజయంతి ఉత్సవాలకు ఆయనను ఆహ్వానిస్తాం’ అని అన్నారు. అటు లక్నోకు 160 కి.మీ దూరం లోని కోవింద్ స్వస్థలం కాన్పూర్ దెహత్ జిల్లాలోని ఝింఝక్ తాలూకా పరౌంఖ్ గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. శుభాకాం క్షలు చెప్పేందుకు వచ్చిన వారందరికీ కోవింద్ కుటుంబసభ్యులు రంగులుపూస్తూ సంబరా లు జరుపుకోవడంతో పాటు మిఠాయిలను పంచారు. రామ్‌నాథ్ సోదరుడి కూతురు హేమలతా కోవింద్ మాట్లాడుతూ ‘ఆయన భారీ ఆధిక్యంతో గెలుస్తారని మాకు ముందే తెలుసు. ఈ రోజు ఫలితాలు వెలువడ్డాక మాకు గర్వంగా ఉంది. ఇప్పుడు మా ఆనందా నికి అవధులే లేవు. మా గ్రామమంతా ఇవ్వాళ హోలీ, దీపావళి జరుపుకుంటోంది.
సాయంత్రం టపాసులు పేలుస్తాం’ అంటూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ప్రమాణ స్వీకార వేడుక కోసం ఢిల్లీ రావాల్సిందిగా జూలై 18నే కోవింద్ తమను ఆహ్వానించారనీ, రైలు టిక్కెట్లను కూడా రిజర్వ్ చేసుకున్నామని హేమలత వెల్లడించారు. అటు లుటియెన్స్ ఢిల్లీలోని 10 అక్బర్ రోడ్డులో ఉన్న కోవింద్ నివాసంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఇది కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అధికారిక నివాసం రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసినప్పటి నుంచి కోవింద్ ఇక్కడే ఉంటున్నారు. బంగ్లా ప్రధాన ద్వారం వద్ద రంగురంగుల పూలతో అలంకరించి రామ్‌నాథ్‌కు ప్రత్యేక స్వాగతం పలికారు.