అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ రోజు ఉదయం 11.30 గంటలకు వైట్హౌస్లో భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా రక్షణ, భద్రత, వ్యాణిజ్యం,పెట్టుబడులు తదితర అంశాలపై సమీక్షించనున్నారని యూఎస్ అధ్యక్ష భవనం వైట్హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఒబామా, మన్మోహన్ సమీక్ష సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడతారని వివరించింది.
అలాగే ఒబామా ఇచ్చే విందులో మన్మోహన్ సింగ్ హాజరవుతారని పేర్కొంది. ఒబామాతో ఈ రోజు మన్మోహన్ సింగ్ జరుపుతున్న సమావేశం మూడోదని తెలిపింది.గతంలో 2009, 2010 సంవత్సరాల్లో వారు భేటీ అయిన విషయాన్ని ఈ సందర్బంగా వైట్హౌస్ గుర్తు చేసింది. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి మన్మోహన్ హాజరవుతారు.
అనంతరం ఈ నెల 29న న్యూయార్క్‌లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ భేటీ కానున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం భారత్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే.