రాజ్పథ్ వద్ద మోదీ యోగ ప్రదర్శన!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరెస్సెస్లో కఠిన శిక్షణ పొందిన విషయం తెలుసు కదూ. ఆయనకు యోగాలో కూడా మంచి పట్టుంది. వచ్చే నెలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ఆయన స్వయంగా యోగాసనాలను ప్రదర్శించి చూపిస్తారు. రాజ్పథ్ వద్ద జూన్ 21వ తేదీన జరిగే కార్యక్రమంలో స్వయంగా ప్రధానమంత్రే పాల్గొని.. శ్వాస నియంత్రణ, ఇతర అంశాలను ప్రదర్శిస్తారని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్యసమితి ఇటీవలే ప్రకటించింది.
ఈ ఏడాదే తొలి యోగా దినం జరగనుంది. ఈ రోజును గుర్తించాలని స్వయంగా ప్రధాని మోదీయే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రసంగిస్తూ చెప్పారు. తాను ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం వల్లే తనకు ఇంత శక్తి వస్తుందని, ప్రతిరోజూ కేవలం కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయినా.. యోగాతోనే ఇంత చురుగ్గా ఉండగలుగుతున్నానని పలు సందర్భాల్లో మోదీ చెప్పారు. ప్రభుత్వాధికారులు కూడా యోగాభ్యాసం చేస్తే మంచిదని చెప్పే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని స్వయంగా యోగాభ్యాసం చేసి చూపించే కార్యక్రమానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.