శ్రీనగర్ : స్థానికంగా ఏర్పాటు చేసిన పారామిలటరీ దళాలను తొలగించాలని హబ్బాకదల్ ప్రాంత వాసులు శనివారం ఆందోళనకు దిగారు. అందులోభాగంగా వందలాది మంది ప్రజలు హబ్బాకదల్ వంతెనపైకి చేరి ఆందోళనకు దిగి... రహదారిని దిగ్భంధనం చేశారు. ఆర్థరాత్రి ... అపరాత్రి అని లేకుండా భద్రత దళాలు తనిఖీల పేరుతో తమను ముప్ప తిప్పలు పెడుతుందని వారు ఆరోపించారు. పారామిలటరీ దళాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున్న స్థానికులు నినాదాలు చేశారు.
అలాగే తనిఖీల పేరుతో బస్సులు, కార్లలను ఆపి... ప్రజలను ఎలా ఇబ్బందులకు గురి చేస్తుందీ వారు ఈ సందర్భంగా వివరించారు. స్థానికుల ఆందోళనను శాంతింప చేసేందుకు పారామిలటరీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు. ఆందోళనకారుల సమస్యలతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.