లోక్‌సభలో అడుగిడుతూనే..
పూసపాటి అశోక్ గజపతి రాజు.. తండ్రి పి.వి.జి రాజు ప్రభావంతో సామ్యవాద భావాల వైపు ఆకర్షితులయ్యూరు. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత 1978లో జరిగిన సాధారణ ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరఫున పోటీ చేసి మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరసగా ఎన్నికవుతూ వస్తున్న ఆయన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి 2004 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో మళ్లీ విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.
* రాజు విజయనగరంలో 1951, జూన్ 26వ తేదీన పీవీజీ రాజు, కుసుమ దంపతులకు జన్మించారు.
* గ్వాలియర్‌లోని సింధియా స్కూలు, హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, విశాఖపట్నంలోని ప్రభుత్వ కృష్ణా కాలేజీలో పీయూసీ విద్యాభ్యాసం చేశారు.
* 26 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా ఉన్నారు. 13 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఆర్థిక, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూ, పునరావాస, ప్రణాళిక, ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు.. తదితర మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు.
* తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నాయకునిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అశోక్ ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు.
* ఈయన సతీమణి సునీల గజపతి. కుమార్తెలు అదితి, విద్య.