Pusapati Ashok Gajapati Raju
-
అశోక్ గజపతిరాజు ఎక్కడ?!
సాక్షి, అమరావతి: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఎక్కడ...? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో జరుగుతున్న తీవ్ర చర్చ ఇది. అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు. గత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం చేస్తున్న కసరత్తులో ఆయన పాత్ర ఇసుమంతైనా కనిపించటం లేదు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు బినామీలుగా పేరుపడ్డ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు మాత్రమే ఈ కసరత్తులో భాగం పంచుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోం మంత్రి రాజ్నా«ద్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల విషయంలో వీరిద్దరే చర్చలు జరుపుతున్నారు. లోక్‌సభలో పార్టీనేత తోట నరసింహంను కూడా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదు. అశోక్ పైరవీలకు బద్ధ వ్యతిరేకి, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తికి కేంద్రంతో సంప్రదింపుల వంటి కీలక బాధ్యతలను అప్పగిస్తే తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే ఏకైక కారణంతో అశోక్‌ను చంద్రబాబు పక్కన పెట్టారని స్వపక్షంలోనే తీవ్ర ప్రచారం జరుగుతోంది. సుజనా, సీఎం రమేష్ లాంటి వారు తిమ్మిని బమ్మిని చేసి వారి ప్రయోజనాలతో పాటు తన సొంత ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరిస్తారనే నమ్మకంతోనే వారిద్దరికీ కీలకమైన ఈ బాధ్యతలను అప్పగించారనే వాదన వినిపిస్తోంది. అశోక్ కేబినెట్ మంత్రిగా ఉన్నా చంద్రబాబు తొలినుంచీ తన బినామీ, సహాయ మంత్రి అయిన సుజనా చౌదరికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్రం వద్దకు రాష్ట్రానికి సంబంధించిన వినతులను తీసుకెళ్లాల్సినపుడు సుజనా చౌదరినే పంపారు. ఆయన తనకిష్టమైన, అనుకూలమైన ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి వినతులను అందించేవారు. ఈ విషయాన్ని అశోక్ ఒకానొక సందర్భంలో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సుజనాకు ప్రాధాన్యత ఇవ్వాలని మీరు భావిస్తే ఆ పని చేసుకోండి తప్ప కేబినెట్లో ఉన్న తనను అవమానపరిచే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. దీంతో కొద్ది రోజులు అశోక్‌కు ప్రాధాన్యతనిచ్చినట్లు వ్యవహరించిన చంద్రబాబు ఆ తరువాత యధావిధిగా బినామీలకు పట్టం కట్టడం ప్రారంభించారు. అదే విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు. -
విజ్జి స్టేడియం పనులు వేగవంతం
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆదేశం విజయనగరం మున్సిపాలిటీ : విజ్జి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన విజ్జి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 2 కిలోమీటర్ల వాటర్ ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళ్లి పనుల ప్రగతిని పరిశీలించారు. చిల్ట్రన్ పార్కు, లాన్‌టెన్నిస్, ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ ఏర్పాటుపై డీఎస్డీఓని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వి.వి.రామచంద్రరాజు జ్ఞాపకార్థం ఏటా 14 ఏళ్ల క్రీడాకారులకు ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం రూ. లక్ష మొత్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు పాల్గొన్నారు. -
డిఫెన్స్‌లో పడ్డ అశోక్ గజపతిరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు మంజూరవుతుందని గంపెడాశలు పెట్టుకున్న గిరిజన యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోవడంపై గిరిజన ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. విద్యార్థి, ప్రజా సంఘాలు, విపక్షాలన్నీ ధ్వజమెత్తుతూ మంత్రుల తీరును దుయ్యబడుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు గొంతు విప్పుతున్నారు. జిల్లాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజురోజుకూ టీడీపీ సర్కార్‌పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. పరిస్థితిని గమనించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యోచనకొచ్చారు. కట్టలు తెగిన ఆగ్రహం జిల్లాకొచ్చిన అరుదైన అవకాశం చేతికంది జారిపోయినట్లయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గాలిలో కలిసిపోతున్నాయని, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని, నేతల స్వార్థ ప్రయోజనాలకు జిల్లా బలవుతోదంటూ ఈనెల 14వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ’చేజారిన గిరిజన యూనివర్సిటీ’ కథనంపై అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు స్పందించాయి. విపక్షాలు సైతం గొంతెక్కుపెట్టాయి. ఆ కథనంలో పేర్కొన్నట్టుగా నాడు ప్రభుత్వ వైద్యకళాశాల, నేడు గిరిజన యూనివర్సిటీ దూరమైందని, నేతల చేతగానితనంతో ఒక్కొక్కటీ చేజారిపోతున్నాయని, ఇవే జిల్లాకు రానప్పుడు చంద్రబాబు ప్రకటించిన కష్టసాధ్యమైన ప్రాజెక్టులు వచ్చేదెలా అని ప్రశ్నిస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలతో నిరసన తెలియజేస్తున్నారు. పాచిపెంట మండలంలోని భూములతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న భూములను ప్రతిపాదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండి పడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గిరిజన యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లాకొచ్చేలా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో అధికార పక్ష నాయకులు కూడా గొంతుకలుపుతున్నారు. జిల్లాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్‌లో పడ్డ అశోక్ గజపతిరాజు అటు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కాకపోవడం, ఇటు గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దూరమవడంతో కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు డిఫెన్స్‌లో పడ్డారు.కేంద్రమంత్రై ఉండి జిల్లాకు అదనపు ప్రయోజనాల్ని కల్పిస్తారనుకుంటే అవేవీ జరగకపోగా ప్రకటించిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. జిల్లాపై ఆయనకున్న మమకారం ఇదేనా? లేదంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోలేకపోతున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవేవీ కాకుండా లోపాయికారీ ఎజెండా ఏదైనా ఉందా అనే సందేహం కలుగుతోంది. బయటికి వ్యక్తం కాకపోయినా ప్రభుత్వ వైద్యకళాశాలకు బదులు ప్రైవేటు వైద్య కళాశాల జిల్లాకు మంజూరు చేసి, దాన్ని మాన్సాస్‌కు అప్పగించడానికి అందుకు ప్రత్యుపకారంగా పాచిపెంట మం డలలోని మాన్సాస్ భూములను గిరిజన యూనివర్సిటీకి అప్పగించేందుకు లోపాయికారీ ఒప్పందం జరిగిందన్న వాదనలున్నాయి. అది వాస్తవమా? కాదా అన్నది పక్కన పెడితే ప్రైవేటు వైద్య కళాశాల మాన్సాస్‌కు అప్పగించడం ఖాయమైంది. కానీ గిరిజన యూనివర్సిటీ మాత్రం ప్రతిపాదిత స్థలం సానుకూలంగా లేదని తరలిపోయింది. స్పందించిన అశోక్ గిరిజన యూనివర్సిటీ తరలిపోయిందన్న వార్తతో, వెల్లువెత్తుతున్న గిరిజనాగ్రహంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో కాస్త అంతర్మథనం చెందారని, ఈ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని సర్కార్ వద్దకు వెళ్లి గిరిజన యూనివర్సిటీ జిల్లాకొచ్చేలా ఒత్తిడి చేసే యోచన కొచ్చినట్టు తెలిసింది. ఆమేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడి, వారి మద్దతును తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె నాయకత్వం వహిస్తే బాగుంటుందన్న ఆలోచనతో మద్దతు కూడగట్టే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. ఈక్రమంలో స్వాతిరాణి అందరితో ఎమ్మెల్యేలతో మాట్లాడి మద్దతు తీసుకునే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. -
వీధికో షాడో!
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి జిల్లాను కనుసన్నల్లో శాసించిన షాడోనేతలా తామూ ఎదిగిపోవాలని, ఎదురులేని విధంగా పెత్తనం చెలాయించాలని టీడీపీ నేతలు ఆత్రంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది షాడోనేతను ఆవహింపజేసుకుని ఆయన్ను అనుసరిస్తూ అధికారులపై ఒతిళ్లు తెస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకి ఒకే ఒక్క షాడోనేత ఉండగా ఇప్పుడు వీధికో షాడో నేత తయారయ్యాడని, వీరితో ఎలా వేగాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు. - టీడీపీ నేతలకు రోల్‌మోడల్‌గా రాజ్యాంగేతర శక్తి - అధికార దాహంతో ఊరికొకరు,వార్డుకొకరు తయారు - ఇప్పటికే మొదలైన అజమాయిషీ - బెంబేలెత్తిపోతున్న అధికారులు,ఉద్యోగులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తరచూ షాడోనేత పేరును వల్లిస్తూ అధికారులపై తీగ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా....విచిత్రంగా మరో పక్క టీడీపీ నాయకులు ఆ నేతను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు. అశోక్ నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేతనే అనుసరిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వార్డుకొక నాయకుడు తయారవుతున్నాడు. పవర్ చెలాయించేందుకు ఇప్పటికే దుకాణాలు తెరిచేశారు. అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు.. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైభవమేంటో అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగా పవర్ చెలాయించారు. షాడోనేతగా పేరుపొందారు. జిల్లాలో ఆయన ఆధిపత్యం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. చెప్పాలంటే ఆ పార్టీ జిల్లా నేతల్లో కసి పెంచింది. కాంగ్రెస్ నేతల్లో ఎవర్ని తిట్టకపోయినా చిన్నశ్రీనును మాత్రం వదిలేవారు కాదు. ఒంటికాలి తో లేచేవారు. ఆయన్ను రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. షాడో నేత కాస్త జీరో అయ్యారు. నాడు సలామ్ కొట్టిన వారంతా దూరంగా ఉంటున్నారు. పిలిచినా పలికేందుకు ఇష్టపడటం లేదు. అయితే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి ముఖం వాచి పోయిన టీడీపీ నాయకులు మాత్రం ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. గతంలో ఆయనెలా అధికారం చెలాయించారో అదే తరహాలో వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా అంతటికీ ఒకే షాడోనేత ఉండగా, ఆ తరహాలో ఇప్పుడు ఊరుకొకరు, వార్డుకొకరు తయారవుతున్నారు. ఎక్కడికక్కడ పవర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు షాడోనేతలా అధికార దర్పం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయకుండానే తమ వద్దకు అధికారులను పిలిపించుకుని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కాని వారు కూడా షాడో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరేమి చేయాలో నిర్ణయిస్తున్నారు. ఏ ఉద్యోగి ఉండాలో, ఎవరు ఉండకూడదో నేరుగా సూచించేస్తున్నారు. తమకిష్టం లేని ఉద్యోగుల్ని, అధికారులను వేరొక చోటకి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కాదని వ్యతిరేకిస్తే తాము బదిలీ చేయాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. పనిచేసే ఉద్యోగులు, అధికారులు కూడా తరుచూ కలవాలని, పాలన పరంగా ఏం చేసినా తమకు చెప్పి చేయాలని, ఏ పథకం వచ్చినా తమ దృష్టిలో పెట్టి ముందుకెళ్లాలని హకుం జారీచేస్తున్నారు. అంతటితో ఆగకుండా పథకాల అమలు, కొత్తగా చేయాల్సిన కార్యక్రమాలు తదితర వాటిపై ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో అధికారులు అవాక్కైపోతున్నారు. గతంలో ఒకరే అనధికార బాస్‌గా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రాంతానికొకరు తయారయ్యారని వాపోతున్నారు. ఇలాగైతే కష్టమేనని, ఒకర్నైతే తట్టుకోగలమని, ఇంతమందైతే వేగలేమనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు. మండలాల్లో ఎంపీటీసీలు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు, జిల్లా పరిషత్‌లో పలువురు జెడ్పీటీసీలు ఇప్పటికే అధికారులపై ఒత్తిళ్లు పెట్టారు. తమకు అనుకూలంగా పనులు చేపట్టాలని జాబితాలిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో తమ వారిని వేసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. తమ మాట వినకపోతే కాంగ్రెస్ మద్దతుదారుడిగా చిత్రీకరించి, బదనాం చేస్తామని పలుచోట్ల బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది. జిల్లా కేంద్రంలో ఇద్దరు నాయకులైతే పార్టీ కీలక నేత అనుచరులమని, తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని అధికారుల వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారు. ఇదంతా చూసి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దని తరచూ సమావేశాల్లో హితబోధ చేస్తున్న అశోక్ దృష్టికి తీసుకెళ్తే తప్ప అదుపులోకి వచ్చేటట్టు లేదన్న ఆలోచనకు అధికారులొస్తున్నారు. -
లోక్‌సభలో అడుగిడుతూనే..
పూసపాటి అశోక్ గజపతి రాజు.. తండ్రి పి.వి.జి రాజు ప్రభావంతో సామ్యవాద భావాల వైపు ఆకర్షితులయ్యూరు. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత 1978లో జరిగిన సాధారణ ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరఫున పోటీ చేసి మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరసగా ఎన్నికవుతూ వస్తున్న ఆయన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి 2004 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో మళ్లీ విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. * రాజు విజయనగరంలో 1951, జూన్ 26వ తేదీన పీవీజీ రాజు, కుసుమ దంపతులకు జన్మించారు. * గ్వాలియర్‌లోని సింధియా స్కూలు, హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, విశాఖపట్నంలోని ప్రభుత్వ కృష్ణా కాలేజీలో పీయూసీ విద్యాభ్యాసం చేశారు. * 26 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా ఉన్నారు. 13 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఆర్థిక, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూ, పునరావాస, ప్రణాళిక, ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు.. తదితర మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. * తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నాయకునిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అశోక్ ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. * ఈయన సతీమణి సునీల గజపతి. కుమార్తెలు అదితి, విద్య. -
'రాజు' మంత్రి అయ్యారు!
విజయనగరం జిల్లా రాజకీయాల్లో గజపతుల వంశానిది ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విజయనగరం రాజకీయాల్లో పూసపాటి అశోక్ గజపతి రాజు తనదైన ముద్రతో రాణిస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటారనే కొంత అపవాదు ఉన్నా.. పరిస్థితులకు అనుగుణంగా అశోక గజపతి రాజు తన శైలిని మార్చుకున్నారు. అయితే తాజా ఎన్నికల్లో తొలిసారి విజయనగరం ఎంపీగా గెలిచిన అశోక్ ను మంత్రి పదవి వరించింది. విజయనగరంలో సూర్యవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విజయనగరం రాజకీయాల్లో అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.. 1978 సంవత్సరంలో జనతాపార్టీ తరపున తొలిసారి అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రవేశం చేశారు. ఆతర్వాత 1983, 1985, 1989, 1994, 1999, 2009 అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 36 సంవత్సరాల పోలిటికల్ కెరీర్ లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా అశోక గజపతి రాజు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న అశోక గజపతి రాజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక మంత్రి పదవులను చేపట్టారు. తొలిసారి విజయనగరం లోకసభకు ఎన్నికైన తమ ఎంపీ 'రాజు'గారు మంత్రి పదవిని చెపట్టడంపై ఆ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.