'రాజు' మంత్రి అయ్యారు!
విజయనగరం జిల్లా రాజకీయాల్లో గజపతుల వంశానిది ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో గజపతుల వంశానిది ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విజయనగరం రాజకీయాల్లో పూసపాటి అశోక్ గజపతి రాజు తనదైన ముద్రతో రాణిస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటారనే కొంత అపవాదు ఉన్నా.. పరిస్థితులకు అనుగుణంగా అశోక గజపతి రాజు తన శైలిని మార్చుకున్నారు. అయితే తాజా ఎన్నికల్లో తొలిసారి విజయనగరం ఎంపీగా గెలిచిన అశోక్ ను మంత్రి పదవి వరించింది. విజయనగరంలో సూర్యవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
విజయనగరం రాజకీయాల్లో అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.. 1978 సంవత్సరంలో జనతాపార్టీ తరపున తొలిసారి అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రవేశం చేశారు. ఆతర్వాత 1983, 1985, 1989, 1994, 1999, 2009 అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 36 సంవత్సరాల పోలిటికల్ కెరీర్ లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా అశోక గజపతి రాజు ఎన్నికయ్యారు.
తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న అశోక గజపతి రాజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక మంత్రి పదవులను చేపట్టారు. తొలిసారి విజయనగరం లోకసభకు ఎన్నికైన తమ ఎంపీ 'రాజు'గారు మంత్రి పదవిని చెపట్టడంపై ఆ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.