అశోక్ గజపతిరాజు ఎక్కడ?!
సాక్షి, అమరావతి: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఎక్కడ...? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో జరుగుతున్న తీవ్ర చర్చ ఇది. అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు. గత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం చేస్తున్న కసరత్తులో ఆయన పాత్ర ఇసుమంతైనా కనిపించటం లేదు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు బినామీలుగా పేరుపడ్డ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు మాత్రమే ఈ కసరత్తులో భాగం పంచుకుంటున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోం మంత్రి రాజ్‌నా«ద్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల విషయంలో వీరిద్దరే చర్చలు జరుపుతున్నారు. లోక్‌సభలో పార్టీనేత తోట నరసింహంను కూడా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదు. అశోక్ పైరవీలకు బద్ధ వ్యతిరేకి, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తికి కేంద్రంతో సంప్రదింపుల వంటి కీలక బాధ్యతలను అప్పగిస్తే తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే ఏకైక కారణంతో అశోక్‌ను చంద్రబాబు పక్కన పెట్టారని స్వపక్షంలోనే తీవ్ర ప్రచారం జరుగుతోంది. సుజనా, సీఎం రమేష్ లాంటి వారు తిమ్మిని బమ్మిని చేసి వారి ప్రయోజనాలతో పాటు తన సొంత ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరిస్తారనే నమ్మకంతోనే వారిద్దరికీ కీలకమైన ఈ బాధ్యతలను అప్పగించారనే వాదన వినిపిస్తోంది.
అశోక్ కేబినెట్ మంత్రిగా ఉన్నా చంద్రబాబు తొలినుంచీ తన బినామీ, సహాయ మంత్రి అయిన సుజనా చౌదరికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్రం వద్దకు రాష్ట్రానికి సంబంధించిన వినతులను తీసుకెళ్లాల్సినపుడు సుజనా చౌదరినే పంపారు. ఆయన తనకిష్టమైన, అనుకూలమైన ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి వినతులను అందించేవారు. ఈ విషయాన్ని అశోక్ ఒకానొక సందర్భంలో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సుజనాకు ప్రాధాన్యత ఇవ్వాలని మీరు భావిస్తే ఆ పని చేసుకోండి తప్ప కేబినెట్‌లో ఉన్న తనను అవమానపరిచే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. దీంతో కొద్ది రోజులు అశోక్‌కు ప్రాధాన్యతనిచ్చినట్లు వ్యవహరించిన చంద్రబాబు ఆ తరువాత యధావిధిగా బినామీలకు పట్టం కట్టడం ప్రారంభించారు. అదే విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు.