డిఫెన్స్‌లో పడ్డ అశోక్ గజపతిరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు మంజూరవుతుందని గంపెడాశలు పెట్టుకున్న గిరిజన యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోవడంపై గిరిజన ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. విద్యార్థి, ప్రజా సంఘాలు, విపక్షాలన్నీ ధ్వజమెత్తుతూ మంత్రుల తీరును దుయ్యబడుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు గొంతు విప్పుతున్నారు. జిల్లాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజురోజుకూ టీడీపీ సర్కార్‌పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. పరిస్థితిని గమనించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యోచనకొచ్చారు.
కట్టలు తెగిన ఆగ్రహం
జిల్లాకొచ్చిన అరుదైన అవకాశం చేతికంది జారిపోయినట్లయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గాలిలో కలిసిపోతున్నాయని, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని, నేతల స్వార్థ ప్రయోజనాలకు జిల్లా బలవుతోదంటూ ఈనెల 14వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ’చేజారిన గిరిజన యూనివర్సిటీ’ కథనంపై అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు స్పందించాయి. విపక్షాలు సైతం గొంతెక్కుపెట్టాయి. ఆ కథనంలో పేర్కొన్నట్టుగా నాడు ప్రభుత్వ వైద్యకళాశాల, నేడు గిరిజన యూనివర్సిటీ దూరమైందని, నేతల చేతగానితనంతో ఒక్కొక్కటీ చేజారిపోతున్నాయని, ఇవే జిల్లాకు రానప్పుడు చంద్రబాబు ప్రకటించిన కష్టసాధ్యమైన ప్రాజెక్టులు వచ్చేదెలా అని ప్రశ్నిస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలతో నిరసన తెలియజేస్తున్నారు. పాచిపెంట మండలంలోని భూములతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న భూములను ప్రతిపాదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండి పడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గిరిజన యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లాకొచ్చేలా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో అధికార పక్ష నాయకులు కూడా గొంతుకలుపుతున్నారు. జిల్లాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిఫెన్స్‌లో పడ్డ అశోక్ గజపతిరాజు
అటు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కాకపోవడం, ఇటు గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దూరమవడంతో కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు డిఫెన్స్‌లో పడ్డారు.కేంద్రమంత్రై ఉండి జిల్లాకు అదనపు ప్రయోజనాల్ని కల్పిస్తారనుకుంటే అవేవీ జరగకపోగా ప్రకటించిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. జిల్లాపై ఆయనకున్న మమకారం ఇదేనా? లేదంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోలేకపోతున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవేవీ కాకుండా లోపాయికారీ ఎజెండా ఏదైనా ఉందా అనే సందేహం కలుగుతోంది. బయటికి వ్యక్తం కాకపోయినా ప్రభుత్వ వైద్యకళాశాలకు బదులు ప్రైవేటు వైద్య కళాశాల జిల్లాకు మంజూరు చేసి, దాన్ని మాన్సాస్‌కు అప్పగించడానికి అందుకు ప్రత్యుపకారంగా పాచిపెంట మం డలలోని మాన్సాస్ భూములను గిరిజన యూనివర్సిటీకి అప్పగించేందుకు లోపాయికారీ ఒప్పందం జరిగిందన్న వాదనలున్నాయి. అది వాస్తవమా? కాదా అన్నది పక్కన పెడితే ప్రైవేటు వైద్య కళాశాల మాన్సాస్‌కు అప్పగించడం ఖాయమైంది. కానీ గిరిజన యూనివర్సిటీ మాత్రం ప్రతిపాదిత స్థలం సానుకూలంగా లేదని తరలిపోయింది.
స్పందించిన అశోక్
గిరిజన యూనివర్సిటీ తరలిపోయిందన్న వార్తతో, వెల్లువెత్తుతున్న గిరిజనాగ్రహంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో కాస్త అంతర్మథనం చెందారని, ఈ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని సర్కార్ వద్దకు వెళ్లి గిరిజన యూనివర్సిటీ జిల్లాకొచ్చేలా ఒత్తిడి చేసే యోచన కొచ్చినట్టు తెలిసింది. ఆమేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడి, వారి మద్దతును తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె నాయకత్వం వహిస్తే బాగుంటుందన్న ఆలోచనతో మద్దతు కూడగట్టే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. ఈక్రమంలో స్వాతిరాణి అందరితో ఎమ్మెల్యేలతో మాట్లాడి మద్దతు తీసుకునే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.