మీ పాపకో పాస్‌వర్డ్ పెట్టండి!
పాపకు పాస్‌వర్డ్ పెట్టడమేంటి? పాపేమైనా కంప్యూటరా? మొబైల్ ఫోనా? అనేకదా మీరు అడుగుతోంది. నిజమే.. కంప్యూటర్‌లో మనకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉండాలంటే దానికో పాస్‌వర్డ్ పెడతాం. మరి కంటికి రెప్పలా చూసుకుంటున్న మన చిన్నారులు భద్రంగా ఉండాలంటే పాస్‌వర్డ్ అక్కరలేదా?... కాస్త కన్ఫ్యూ జింగ్‌గా ఉంది కదూ.. అయితే ఇది చదవండి...తూర్పుఢిల్లీలోని వివేకానందనగర్‌లోగల లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న రితిక వయసు 8 ఏళ్లు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు తల్లి స్వయంగా స్కూల్‌కు వచ్చి తీసుకెళ్లేది. ఒకరోజు ట్రాఫిక్‌జామ్ కావడంతో తల్లిరావడం ఆలస్యమైంది. దీంతో రితిక తల్లికోసం ఎదురుచూస్తూ స్కూల్ గేట్ దగ్గరే నిలబడింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు.
పాపదగ్గరికి వెళ్లి.. మీ అమ్మకు ఏదో అర్జంట్ పని ఉండడంవల్ల రాలేకపోయిందని, తీసుకురమ్మని తనను పంపిందని పాపతో చెప్పాడు. వెంటనే ఆ ‘పాప పాస్‌వర్డ్ ఏంటి?’ అని అడిగింది. దీంతో బిత్తరపోయిన కిడ్నాపర్ ఏం చెప్పాలో తోచక మమ్మీ పాస్‌వర్డ్ ఏమీ చెప్పలేదన్నాడు. దీంతో ఎదుటి వ్యక్తి తనను కిడ్నాప్ చేయడానికే వచ్చాడన్న అనుమానంతో రితిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దీంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడం, కిడ్నాపర్‌ను పోలీసులకు పట్టివ్వడం చకచకా జరిగిపోయాయి. రితిక తల్లి చేసిన ఓ చిన్న ఆలోచన పాపను కిడ్నాప్ కాకుండా కాపాడింది. సో.. ఇప్పుడు అర్థమైంది కదా.. పాపకు పాస్‌వర్డ్ ఎందుకో?