ఆసక్తి, పట్టుదలే అతని విజయ రహస్యం... | Kerala Kannur Man Javed Success Story | Sakshi
Sakshi News home page

ఆసక్తి, పట్టుదలే అతని విజయ రహస్యం...

Published Mon, Jun 18 2018 1:27 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Kerala Kannur Man Javed Success Story - Sakshi

కంపెనీ ఉద్యోగులతో జవాద్‌

తిరువనంతపురం, కేరళ : అందరికి తల్లిదండ్రులు పేరు పెడితే అతనికి మాత్రం కంప్యూటరే పేరు పెట్టింది. కేవలం నామకరణతోనే ఆగక ఆ యువకుడి జీవిత చిత్రాన్నే మార్చేసింది. సొంత ఇల్లు, ఖరీదైన బీఎండబ్ల్యూ కారుతో పాటు సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కంపెనికి యజమాని అయ్యేలా చేసింది. కంప్యూటర్‌ పట్ల ఆ యువకుడికి ఉన్న ఆసక్తి వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎన్నుకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి రుజువు చేసాడు కేరళ కన్నూర్‌కు చెందిన 21 ఏళ్ల జవాద్. కంప్యూటర్‌ను మంచికి వినియోగిస్తే కలిగే ప్రయోజనాలకు సజీవ ఉదాహరణగా నిలిచాడు జవాద్.

ఎవరీ జాదవ్‌...ఏమిటితని కథ...?
కేరళ ఉన్నార్‌కు చెందిన జవాద్‌ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. జవాద్‌ తండ్రి దుబాయిలో బ్యాంక్‌ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో ఓ సారి ఇండియా వచ్చినప్పుడు జవాద్‌కు కంప్యూటర్‌ను బహుమతిగా ఇవ్వడమే కాక దానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను కూడా పెట్టించాడు. అదే జవాద్‌ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అనాటి నుంచి కంప్యూటర్‌తో ప్రేమలో పడిపోయాడు జవాద్‌. ఇక ఆరోజు నుంచి కంప్యూటర్‌కు బానిసయ్యాడు(మంచి వ్యసమే..). ఒక సారి తన పేరుతో జీమెయిల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసే క్రమంలో కంప్యూటర్‌ జవాద్‌ పేరును ‘టీఎన్‌ఎమ్‌ జవాద్‌’గా సజెస్ట్‌ చేసింది. ఆ పేరే నేడు ఎన్నో ప్రభంజనాలు సృష్టిస్తోంది.

జవాద్‌ పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే కంప్యూటర్‌తో ప్రయోగాలు ప్రారంభించాడు. అంత చిన్న వయసులోనే వెబ్‌సైట్‌లు రూపొందించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న కంపెనీని ప్రారంభించాడు. అలా పదో తరగతిలోనే 2,500 రూపాయల తొలి సంపాదనను అందుకున్నాడు జవాద్‌. ఒక్కసారిగా జవాద్‌ దగ్గర అంత సొమ్ము చూసిన అతని తల్లిదండ్రులకు భయమేసింది. తమ కుమారుడు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నాడేమోనని భయపడ్డారు. కానీ జవాద్‌ వారికి తాను ప్రారంభించిన వ్యాపారం గురించి వివరించాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో వెబ్‌ డిజైనింగ్‌ను మరింత బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. కోర్సు అయిపోయిన తర్వాత తనకు వెబ్‌డిజైనింగ్‌ పాఠాలు చెప్పిన టీచర్లను తాను ప్రారంభించబోయే కంపెనీలో ఉద్యోగులుగా చేరమని కోరాడు. అందుకు వారు అంగీకరించడంతో వారిద్దరిని ఉద్యోగులుగా నియమించుకుని ‘టీఎన్‌ఎమ్‌ ఆన్‌లైన్‌ సొల్యూషన్న్‌’అనే వెబ్‌డిజైనింగ్‌ సంస్థను స్థాపించాడు. ప్రారంభంలో కేవలం వెయ్యి రూపాయల తక్కువ ధరకే వెబ్‌సైట్లను రూపొందించేవారు. అయినా కూడా నెలకు కేవలం 2,3 ఆర్డర్‌లు మాత్రమే వచ్చేవి. ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి జవాద్‌ తన అమ్మగారి బంగారు గాజులను కూడా కుదవపెట్టాడు.

క్లైంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ..రెండేళ్ల నాటికి 100 వరకూ చిన్నా చితకా కంపెనీలు జవాద్‌ క్లయింట​ లిస్ట్‌లో చేరాయి. సరిగా ఇదే సమయంలో నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన యస్‌ కేరళ సమ్మిట్‌లో జవాద్‌ పాల్గొన్నాడు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం జవాద్‌కు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల జవాద్‌ కంపెనీ గురించి చాలామందికి తెలియడమే కాక మరిన్ని ఆఫర్లు రావడం ప్రారంభమయ్యింది. కంపెనీ బాగా నడవడంతో లాభాలు కూడా ఆశించిన రీతిలోనే వచ్చాయి. దాంతో జవాద్‌ తన సొంత ఇంటి కలను నిజం చేసుకోవడమే కాక చాలా ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ కార్‌ను కూడా కొన్నాడు.

మరో కీలక మలుపు...
వీటన్నిటి తర్వాత వెబ్‌ ప్రపంచానికి కీలకమైన ‘సర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌’(ఎస్‌ఈవో) రంగంలోకి తన సేవలను విస్తరించాడు జవాద్‌. అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యువ కెరటం. ఇతని ప్రతిభకు గుర్తుగా యూఏఈ, బిస్టౌడ్‌ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘డా. రామ్‌ బుక్సానీ’ అవార్డును జవాద్‌కు ప్రదానం చేసారు. ప్రస్తుతం జవాద్‌ వెబ్‌ డిజైనింగ్‌‌, ఆప్‌ డెవలప్‌మెంట్‌, ఈ కామర్స్‌ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా క్లైంట్‌లను ఏర్పర్చుకున్నాడు. ఇవేకాక జవాద్‌ ప్రస్తుతం ‘టీఎన్‌ఎమ్‌ అకాడమీ’ని స్థాపించి ఆసక్తి ఉన్న వారికి వయసుతో సంబంధం లేకుండా వెబ్‌డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాడు. ఆసక్తి ఉన్న రంగంలో పట్టుదలగా ప్రయత్నిస్తే ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది జావేద్‌ జీవితం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement