కంప్యూటర్ ముచ్చట తీరుస్తున్న కుర్రాళ్లు! | Meet the boys of the computer today! | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ ముచ్చట తీరుస్తున్న కుర్రాళ్లు!

Published Thu, Jul 17 2014 12:01 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

కంప్యూటర్ ముచ్చట తీరుస్తున్న కుర్రాళ్లు! - Sakshi

కంప్యూటర్ ముచ్చట తీరుస్తున్న కుర్రాళ్లు!

మాటెత్తితే ప్రపంచమంతా డిజిటల్ మయమైందని అంటుంటాం.. జనాలు ఆఫ్‌లైన్‌లో కనపడటం లేదు, ఆన్‌లైన్‌కే పరిమితమయ్యారు అని తిట్టుకొంటాం... పిల్లలు మైదానాల్లో ఆడుకోవడం మానేసి కంప్యూటర్‌గేమ్స్‌కు పరిమితమయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం...యువత సోషల్‌నెట్‌వర్కింగ్‌కు బానిస అయ్యిందని ఆందోళన వ్యక్తం చేస్తాం... అయితే ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం చూసుకొన్నా ఇప్పటికీ మన దేశంలో ప్రతి పది ఇళ్లకూ ఒకే కంప్యూటర్ ఉంది!  మరి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పీసీని సామాన్యుల దరి చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు... ముకుంద్, రాఘవలు.
 
విద్యా, వైజ్ఞానిక, సంఘ జీవనంలో ఇప్పుడు కంప్యూటర్ ఒక తప్పనిసరి అవసరం. మరి అందుకోసం ‘మా వల్లనే ఐటీ సెక్టార్ అభివృద్ధి జరిగిందని, సెల్‌ఫోన్ కూడా తమ వల్లనే సామాన్యులకు దగ్గరైంది...’ అని డబ్బా కొట్టుకొనే నేతలు ఏం చేస్తున్నారో కానీ... ఇద్దరు యువకులు మాత్రం ఆరేళ్లుగా ఒక అద్వితీయ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు పీసీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తక్కువ ధరలోనే పీసీలను అందుబాటులో ఉంచి.. చాలా మంది ముచ్చట తీరుస్తున్నారు. మరి అదెలా సాధ్యం అవుతోందంటే...
 
మన మెట్రో నగరాల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి... వాటిల్లో వందల, వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు పీసీల్లో అధునాతన వెర్షన్‌లు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిన రీతిలోనే చాలా సార్లు పీసీలను కూడా మార్చేస్తూ ఉంటాయి ఐటీ కంపెనీలు. మరి అలా మార్చేయాల్సి వచ్చినప్పుడు పాత కంప్యూటర్‌లను ఏం చేస్తారు?! దాదాపు ఆరేళ్ల క్రితం ఈ సందేహం వచ్చిందట ముకుంద్‌కు.
 
చెన్నైకి చెందిన ఈ యువకుడు అప్పటికే గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోవదిలి కంప్యూటర్ విడిభాగాలను అమ్మే తన స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సందేహం వచ్చిన వెంటనే కొన్ని ఐటీ కంపెనీ ఆఫీసులను సందర్శించి అక్కడి పనితీరు గమనించాడు. చాలా చోట్ల పనితీరు బాగానే ఉన్నా..పాత డెస్క్‌టాప్ పీసీలను స్టోర్‌రూమ్‌లలోనూ, పార్కింగ్ ప్లేస్‌లలోనూ పెట్టి ఉంచడాన్ని గమనించాడు. ‘ఇ-వేస్ట్’ అంటూ కంపెనీలు పక్కన పెట్టేసిన ఆ పీసీలను సేకరించడం మొదలు పెట్టాడు ముకుంద్.

 ఈ విషయంలో ముకుంద్‌కు అతడి సమీప బంధువు రాఘవ తోడయ్యాడు. రూ.4,500  ధర నుంచే దొరుకుతాయట ఐటీ కంపెనీల వద్ద సెకండ్ హ్యాండ్ కంప్యూటర్‌లు. వాటి కాన్ఫిగరేషన్‌ను బట్టి..  తక్కువ ధర, తగిన ధరను చెల్లిస్తూ వాటిని కొనడం మొదలు పెట్టారు వీళ్లిద్దరూ. అలా సేకరించిన కంప్యూటర్‌లతో 2009లో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ‘రెన్యూ ఐటీ’ పేరుతో ఒక షాప్‌ను నెలకొల్పి వాటిని అమ్మడం మొదలు పెట్టారు.
 
మొదట కొందరు ఎన్జీవోలకు తక్కువ ధరకే ఈ కంప్యూటర్‌లను అమ్మారట. ఎటువంటి ప్రచార అవసరాలూ లేకుండా ఒకరికి మరొకరు చెప్పడం ద్వారా వీళ్ల గురించి అనేక మందికి తెలిసింది. సెకండ్ హ్యాండ్ కంప్యూటర్‌లు కొనడానికి అందరూ ఎగబడ్డారు. విద్యాసంస్థల వాళ్లు, విద్యార్థులు, గ్రాఫిక్ డిజైనర్‌లు, ఆర్‌జేలు, డాక్టర్లు, టీచర్ల దగ్గర నుంచి కారు డ్రైవర్ల వరకూ అన్ని వర్గాల ప్రజలూ తమ వద్దకు వచ్చి కంప్యూటర్‌లను కొనుగోలు చేయడం మొదలు పెట్టారని ముకుంద్, రాఘవలు చెబుతారు.
 
అయితే ఇలా సెకండ్ హ్యాండ్ కంప్యూటర్‌లు అమ్ముతున్న వీళ్ల అనుమతి లేదంటూ ప్రభుత్వాధికారులు వెంటపడ్డారు. లంచం ఇస్తే అనుమతి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అలా డిమాండ్ చేసిన ఒక అధికారికి తమ వద్ద అమ్మకానికి ఉన్న ల్యాప్‌టాప్‌ను ఇచ్చి వదిలించుకొన్నారీ యువకులు.
 
2011లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ చట్టం’ వీళ్లకు వరంగా మారింది. అ చట్టం ప్రకారం అన్ని ఐటీ కంపెనీలూ.. తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను గుర్తింపు పొందిన అమ్మకం దారులకు అమ్మాల్సి ఉంటుంది. అప్పటికే ఆ వ్యాపారంలో గుర్తింపు పొందిన ‘రెన్యూ ఐటీ’కి తిరుగులేకుండా పోయింది.
 
ప్రస్తుతం వీళ్లిద్దరి వ్యాపారం ఏడాదికి ఆరు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకొంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని అనేక ఐటీ కంపెనీల దగ్గర నుంచి వృథాగా ఉన్న పీసీలను, ల్యాప్‌టాప్‌లను వీళ్లు కొనుగోలు చేస్తున్నారు.
 
కంపెనీలు అతి తక్కువ ధరకు అయినా వాటిని వదిలించుకోవాలని భావిస్తుండటం వీళ్లకు కలిసొస్తోంది. ‘రెన్యూ ఐటీ’కి కూడా పెద్దగా లాభాపేక్ష లేదని, తాము గ్రామీణ భారతీయులకు, పేద, మధ్య తరగతి కుటుంబాలకు కంప్యూటర్‌లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని ముకుంద్, రాఘవలు చెబుతున్నారు.
 
కంప్యూటర్ కొనడం అనేది భారతీయ కుటుంబాలకు ఇప్పుడు ఒక సంబరం. కానీ ధరల విషయంలో మాత్రం చాలా కుటుంబాలకి అందడం లేదవి. ఇటువంటి నేపథ్యంలో తమకు తోచిన పరిష్కార మార్గం ద్వారా చాలా మంది కంప్యూటర్ కోరికను తీరుస్తున్నారు ఈ యువకులు. అనేక భారతీయ కుటుంబాలను డిజిటల్ బూమ్‌లో భాగం చేస్తున్న ఈ యువకులను ప్రత్యేకంగా అభినందించవచ్చు.
 
కంప్యూటర్ కొనడం అనేది భారతీయ కుటుంబాలకు ఇప్పుడు ఒక సంబరం. కానీ ధరల విషయంలో మాత్రం చాలా కుటుంబాలకు అందడం లేదవి. ఇటువంటి నేపథ్యంలో తమకు తోచిన పరిష్కార మార్గం ద్వారా చాలామంది కంప్యూటర్ కోరికను తీర్చుతున్నారు ఈ యువకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement