
ఉల్లికి పిజ్జాకు తేడా తెలియదు ఆయన నాయకుడా?
భోపాల్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్కు ఉల్లిగడ్డకు పిజ్జాకు(ప్యాజ్ అండ్ పిజ్జా) తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు రైతుల నాయకుడుగా ముందుకొస్తున్నారని విమర్శించారు. 'రాహుల్కు ఉల్లిగడ్డలు పిజ్జాలు, వంకాయలు, బర్గర్లకు తేడా తెలియదు. కానీ, ఆయన రైతుల నాయకుడుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎప్పటికీ ఈ విషయంలో విజయవంతం కాలేరు' అని ఆయన చెప్పారు.
తమ ప్రభుత్వాన్ని కొనియాడుతూ తొలిసారి రాజకీయాలకంటే దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరిగిందని చెప్పారు. కొన్నిసార్లు ప్రభుత్వాలను అసత్యాలతో నిందిస్తున్నారని వాస్తవాలేంటో ప్రజలకు, మీడియాకు తెలియజేయాలని మీడియా అధికారిక ప్రతినిధులకు తెలియజేశారు.