ఆరెస్సెస్ సిద్ధాంతాల వల్లే గాంధీ హత్య: రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ సామ్రాజ్యంలో పర్యటించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపైన, ఆర్ఎస్ఎస్పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఆరెస్సెస్ విధానాలు, సిద్ధాంతాల వల్లే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కేవలం ధనవంతులకు మాత్రమే అనుకూలంగా ప్రభుత్వపాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము ప్రజలకు అధికారం ఇవ్వాలనుకుంటున్నామని, ఇక్కడ కేవలం ఒక్కరి చేతుల్లోనే అధికారం ఉందని అన్నారు. కేవలం ఐదుగురే మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. పేదలకు కూడా ఓ ప్రభుత్వం అవసరమని, చిన్న పరిశ్రమలన్నీ ఇక్కడ మూతపడ్డాయని అన్నారు.
ఒక్క వ్యక్తి తప్ప వేరెవ్వరికీ అధికారం లేదని, తమకు - వాళ్లకు తేడా అదేనని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తామేనని బీజేపీ చెప్పుకొంటోందని, తాము పేదరికాన్ని తొలగించాలంటే ఇక్కడ ఏకంగా పేదలనే తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. చాయ్ వాలాను ప్రధాని అభ్యర్థి చేశామన్న వ్యాఖ్యలను విమర్శిస్తూ, ''కొందరు టీ అమ్ముకుంటారు, కొందరు టాక్సీ నడుపుతారు, కొందరు పొలంలో పనిచేస్తారు. అయినా వాళ్లందరినీ మనం గౌరవించాలి. కానీ టీ అమ్ముకునేవాడైనా, రైతు అయినా, కూలీ అయినా పర్వాలేదు గానీ, జనాన్ని మోసంచేసేవాళ్లను మాత్రం గౌరవించకూడదు'' అని రాహుల్ అన్నారు.