ఇది సూటు, బూటు ప్రభుత్వం | rahul gandhi takes on modi govt | Sakshi
Sakshi News home page

ఇది సూటు, బూటు ప్రభుత్వం

Published Tue, Apr 21 2015 4:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఇది సూటు, బూటు ప్రభుత్వం - Sakshi

ఇది సూటు, బూటు ప్రభుత్వం

న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై పోరును కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత తీవ్రం చేశారు. ప్రభుత్వంపై విమర్శల పదును పెంచారు. దేశంలోని రైతులు, రైతుకూలీల దారుణ స్థితిగతుల్ని పట్టించుకోకుండా.. పారిశ్రామిక వర్గాల కోసమే పనిచేస్తోందంటూ ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న రైతుల దయనీయ స్థితిగతులపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో అరగంట పాటు రాహుల్ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ‘అచ్చే దిన్ సర్కార్’, ‘సూటు బూటు ప్రభుత్వం’ అన్న రాహుల్ వ్యాఖ్యలకు విపక్షం నుంచి మంచి స్పందన వచ్చింది.

రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నించగా.. కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఉత్సాహపరిచారు. తన కుమారుడి ప్రసంగాన్ని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సైతం ప్రశంసించారు.  రెండు నెలల సెలవు తర్వాత ఆదివారం ఢిల్లీలో జరిగిన కిసాన్ ర్యాలీలోనూ, సోమవారం లోక్‌సభలోనూ ఇనుమడించిన ఉత్సాహంతో మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు సంధించడం విశేషం. బడ్జెట్ తొలి దశ సమావేశాల్లో రాహుల్ పాల్గొనకపోవడం తెలిసిందే. సభలో తాను మంచి ప్రసంగం ఇచ్చానని, ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదని అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో వ్యాఖ్యానించారు.
మీకు లాభం.. మాకు నష్టం..  రైతుల విషయంలో ఈ ‘అచ్చేదిన్ సర్కార్’ విఫలమైందని రాహుల్ విమర్శించారు. రైతులను విస్మరించి.. కార్పొరేట్లకు, సంపన్నులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరు వల్ల భవిష్యత్తులో బీజేపీ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ‘పెద్ద తప్పు చేస్తున్నారు. రైతులు భవిష్యత్తులో మిమ్మల్ని దెబ్బతీస్తారు’ అన్నారు. దేశ ప్రగతికి రైతులే పునాది వేశారని, ఇప్పుడా రైతుల్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. ‘ప్రధానిగారికో సలహా ఇస్తున్నా.

ఆయన ఇప్పటికైనా పారిశ్రామిక వర్గాల వైపు నుంచి దేశ జనాభాలో 67% ఉన్న రైతాంగం వైపునకు మారితే రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేస్తూ మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. అదే కొనసాగితే వారు మిమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తారు. అదే మీరు రైతుల పక్షాన నిలిస్తే మీకు ప్రయోజనం కలుగుతుంది. బహుశా మాకు నష్టం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘ఎన్నికల లెక్కలు మీకు బాగా తెలుసు కదా. ఈ మధ్యే ఎలక్షన్లలో కూడా గెలిచారు’ అంటూ మోదీని ఎత్తిపొడిచారు.
మీ ప్రధాని కాదా..! ఈ సందర్బంగా అధికార పక్ష సభ్యులనుద్దేశించి ‘మీ ప్రధాని’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు అటువైపు నుంచి ‘ఆయన దేశానికి ప్రధాని’ అని జవాబొచ్చింది.

దానికి వెంటనే ‘ఏం.. మీ ప్రధాని కాదా?’ అంటూ రాహుల్ ఇచ్చిన కౌంటర్‌కు కాంగ్రెస్ సభ్యుల నుంచి మంచి స్పందన వచ్చింది. రైతుల పంటభూములకు ఇటీవల ధరలు బాగా పెరుగుతున్నాయి. దాంతో మీ కార్పొరేట్ మిత్రుల కన్ను వాటిపై పడింది. అందకని వారికోసం మీరో ప్లాన్ వేశారు. ముందుగా సాగునీరు, ఎరువులు, మద్దతు ధరలాంటివి ఇవ్వకుండా రైతులను బలహీనపరుస్తారు. ఆ తరువాత భూ ఆర్డినెన్స్ సాయంతో వారి భూములను లాక్కొని మీ పారిశ్రామిక మిత్రులకు కట్టబెడ్తారు’ అంటూ ప్రధానిపై విరుచుకుపడ్డారు.  
అప్పుడు దోచుకున్నవారే..
ఆర్జేడీ సభ్యుడు జయప్రకాశ్ నారాయణ్ యాదవ్ మాట్లాడుతూ.. రైతులకు ప్రాతినిధ్యం లేని మేకిన్ ఇండియా కార్యక్రమం సఫలం కాబోదన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో కునారిల్లిన రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగుపర్చాలని పలువురు విపక్ష సభ్యులు సూచించారు. పంట నష్టానికి అధిక పరిహారం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ సభ్యులు ప్రశంసించారు. అనంతరం చర్చకు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఇచ్చిన సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, ఎస్పీలు వాకౌట్ చేశాయి. గతంలో రైతులను దోచుకున్న వారే ఇప్పుడు రైతుల పక్షాన నిలుస్తున్నామంటున్నారని తన సమాధానంలో రాధామోహన్ ఆక్షేపించారు. తాము కార్పొరేట్ల పక్షం కాదని స్పష్టం చేశారు.
ఐదేళ్లు ఓపిక పట్టండి!
అంతకుముందు, రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు.. ‘రాహుల్ బాబు.. మీరు 50 ఏళ్లు అధికారంలో ఉన్నారు. మేమొచ్చి 10 నెలలే అయింది. రైతులు, పేదలు, గ్రామీణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఐదేళ్లు ఓపిక పట్టండి’ అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి అందరం కలిసి ఆలోచించాల్సి ఉందన్నారు. వ్యవసాయానికికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు గురించి ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందన్నారు. యూపీఏ హయాంలో 462 ఆర్డినెన్సులు జారీ కాగా, తాము పదే జారీ చేశామన్నారు. మరిన్ని సంప్రదింపుల అనంతరమే భూఆర్డినెన్సును మళ్లీ జారీచేశామని వివరించారు.
లోక్‌సభలో భూ ఆర్డినెన్స్
విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య తాజాగా పునః జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ను సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభ ముందుంచారు. ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు, సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆర్డినెన్స్ జారీని ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణిస్తూ.. తక్షణమే రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ నిరసనల్లో పాల్గొన్నారు. గందరగోళం నెలకొనడంతో గంటన్నరపాటు సభను స్పీకర్ సుమిత్ర మహాజన్ వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాతా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు, రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం దొడ్డిదారిన బిల్లును తీసుకురావాలనుకుంటోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

సభ ముందుకు సంబంధిత బిల్లు వచ్చినప్పుడు అభ్యంతరాలు తెలపాలని, ఆర్డినెన్స్ జారీ చేశాక సభ ముందు దాన్ని పెట్టడం నిబంధనల ప్రకారం అవసరమని రూడీ అన్నారు. శాంతించని కాంగ్రెస్, టీఎంసీ  సభ్యలు వాకౌట్ చేశారు. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 3 లక్షల మందికిపైగా వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభకు తెలిపారు. బడ్జెట్ సమావేశాల చివరలో లోక్‌సభలో భూ సేకరణ బిల్లును ప్రవేశపెడ్తామని మంత్రి వెంకయ్యనాయుడు విలేకర్లకు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement