
ఏప్రిల్ 19 విడుదల
దేశం యావత్తు కళ్లల్లో ఒత్తులేసుకుని ఆయన కోసం చూస్తోంది.. ఇన్నాళ్లు ఎక్కడి కెళ్లాడని ప్రజలు అడిగితే.. 'బాబు తొందర్లోనే వచ్చేస్తాడ'ని అమ్మ మాటిచ్చింది. ఇప్పుడా మాట నిజం కానుంది. అవును.. దాదాపు నెల రోజులకు పైగా అజ్ఞాతంగా విశ్రాంతి తీసుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏప్రిల్ 19న ప్రజల ముందుకు, ప్రజలలోకి రానున్నారు.
విశ్రాంతి కాలంలో ఎక్కుపెట్టిన బాణంలా తనను తాను సిద్ధం చేసుకున్న రాహుల్.. వస్తూనే ఎన్డీఏపై విరుచుకుపడనున్నారు. భూ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఏప్రిల్ 19న కాంగ్రెస్ కిసాన్ మోర్చా ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు. పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ పునరాగమనాన్ని నిర్ధారించారు. ఏప్రిల్ 20 నుంచి రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరవుతారని చెప్పారు.