తొలిసారిగా విజయవాడకు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు సాదర స్వాగతం లభించింది.
విజయవాడ: తొలిసారిగా విజయవాడకు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు సాదర స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు రాజ్నాథ్కు ఘన స్వాగతం పలికారు. నర్సరావుపేట మున్సిపాలిటీ శతాబ్ధి వేడుకల నుంచి నేరుగా గన్నవరం వచ్చిన సీఎం.. రాజ్ నాథ్ రాక కోసం కాసేపు వేచిచూశారు.
అనంతరం కేంద్ర మంత్రిని క్యాంప్ ఆఫీస్ కు తోడ్కొని వెళ్లిన సీఎం.. అక్కడ రాజ్ నాథ్ గౌరవార్థం విందు ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా, పలు జిల్లాలు దెబ్బతిన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం.. సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రతిగా ఏపీని అన్నివిదాలా ఆదుకుంటామని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు. శనివారం విజయవాడలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యఅధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.