రాజ్యసభ పోరు రసవత్తరం
6 స్థానాల్లో కాంగ్రెస్‌కు 3, టీడీపీకి ఒక్కటే ఖాయం
రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యం
ఒక్కో అభ్యర్థి గెలుపునకు 41 మంది ఎమ్మెల్యేల ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరం
ఆ పార్టీల్లోని పలువురు పక్కచూపులు
పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ తప్పదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో.. ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రావడం ప్రధాన రాజకీయ పార్టీలను ఇరకాటంలో పడేసింది. శాసనసభలో ఆయా పార్టీల బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన అంశం, రాజకీయ పార్టీల్లోని అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు అనివార్యమయ్యే వాతావరణం కనబడుతోంది. రాష్ట్రంలో ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా శాసనసభలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు సొంతంగా కేవలం నాలుగు స్థానాలే గెలిపించుకోగలిగిన స్థితిలో ఉన్నారుు.
దీంతో మిగిలిన రెండు స్థానాల విషయం ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం శాసనసభలో 280 మంది (నామినేటెడ్ సభ్యురాలితో కలిపి) సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి సస్పెండ్ కాగా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆయూ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. రాజ్యసభ స్థానాన్ని గెలుపొందాలంటే 41 మంది శాసనసభ్యుల ప్రథమ ప్రాధాన్యత ఓట్లు (కోటా ఓట్లు) రావాలి. ప్రస్తుతం సభలో ఉన్న సంఖ్యా బలంతో కాంగ్రెస్‌కు మూడు, టీడీపీ ఒక్క సీటు కచ్చితంగా దక్కించుకుంటారుు. మిగిలిన రెండు సీట్ల భవితవ్యం మాత్రం కాంగ్రెస్, టీడీపీలలోని మిగతా సభ్యులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఇతర పార్టీల సభ్యులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత శాసనసభ కాలంలో గతంలో రెండుసార్లు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగ్గా, ప్రతిసారీ ఏక గ్రీవంగానే ముగిసాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 4, టీడీపీ 2 స్థానాల చొప్పున దక్కించుకున్నాయి.
ఎమ్మెల్యేలు పార్టీలకు కట్టుబడేనా?
2009 ఎన్నికల తరువాత అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష టీడీపీల వైఖరి నచ్చక ఆయా పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసి మరో పార్టీలో చేరి తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీని ధిక్కరించి మరో పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పినిపె విశ్వరూప్, సి.ఆదినారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాజన్నదొరలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన కె.హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి, గంగుల కమలాకర్, హన్మంతు షిండే టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకే చెందిన చిన్నం రామకోటయ్య ప్రస్తుతం పార్టీతో విభేదించి కాంగ్రెస్‌కు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభకు రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు.
పార్టీలు విప్ జారీ చేసినా అది చెల్లుబాటు కాదు. సాధారణ ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఈ ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా ఆయా పార్టీల్లో మిగిలిన వారు ఎంతమంది రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ సూచనలకు కట్టుబడి ఉంటారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు తమ పార్టీ విధానాలకు మించి సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రహస్య ఓటింగ్ కూడా వారికి కలిసివచ్చే అంశమే. ఈ అంశాల దృష్ట్యా పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఫలితాలు ఆసక్తికరంగా ఉండొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అగ్నిపరీక్ష కాబోతున్నాయి. తెలంగాణ విషయంలో అధిష్టాన వైఖరిని ధిక్కరిస్తున్నట్టుగా పైకి ప్రచారం చేసుకుంటున్న ఆయన ఈ ఎన్నికల విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికర అంశం.
కొనసాగనున్న అసెంబ్లీ?: రాజ్యసభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన దరిమిలా ఓటాన్ అకౌంట్ (బడ్జెట్) కోసం ఈ నెలాఖరు నుంచే అసెంబ్లీ సమావేశాలు మళ్లీ కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం సమావేశాలు 23 వరకు సాగనున్న విషయం తెలిసిందే. అరుుతే 23 తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి ఈ నెల 27 నుంచే తిరిగి బడ్జెట్ సమావేశాలు కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి.
ఫిబ్రవరి 7న పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: 2014 ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుండడంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 6 స్థానాలు సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని 55 స్థానాల సభ్యులు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 14 మధ్య కాలంలో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారు. ఆ స్థానాలను భర్తీచేసేందుకు ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఫిబ్రవరి 7న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఓట్ల లెక్కింపు చేపడ్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న టి.సుబ్బిరామిరెడ్డి, నంది ఎల్లయ్య, మహ్మద్ అలీ ఖాన్(ఎం.ఎ.ఖాన్), టి.రత్నాబాయి, కె.వి.పి. రామచంద్రరావు, టీడీపీకి చెందిన నందమూరి హరికృష్ణల పదవీకాలం ఏప్రిల్ 9న పూర్తికానుంది. అయితే నందమూరి హరికృష్ణ గత ఆగస్టు 22న తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.