లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించటానికి అప్రజాస్వామిక పద్ధతులను అవలంబించారన్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించటానికి అప్రజాస్వామిక పద్ధతులను అవలంబించారన్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. బిల్లును నిబంధనల ప్రకారమే ఆమోదించటం జరిగిందని పేర్కొంది. ‘‘ఈ నెల 13వ తేదీన లోక్‌సభలో చోటుచేసుకున్న హింస కచ్చితంగా హేయమైనదే. అది దురదృష్టకరం. కానీ.. నిన్న (మంగళవారం నాడు) నిబంధనల ప్రకారం తెలంగాణ బిల్లును ఆమోదించారు. దీనిని సంపూర్ణంగా నిబంధనల ప్రకారమే ఆమోదించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ లేదు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ చెప్పారు.
మంగళవారం నాడు లోక్‌సభలో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా.. ఆ గందరగోళం మధ్యలోనే.. లోక్‌సభ టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోగా.. మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలన్నీ రాజ్యసభలోనూ మద్దతు ఇవ్వాలని కమల్‌నాథ్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ట్విటర్‌లో ‘‘లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా ఎంపీలు కండబలం ప్రదర్శించకుండా పార్లమెంటరీ నైపుణ్యాలను ప్రదర్శించినట్లయితే ప్రజాస్వామ్యం మరింత బలంగా ఉండేది. హైదరాబాద్‌కు కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) ఇవ్వటమంటే.. ఎమ్మెల్యేలకు హక్కులను నిరాకరించటమే అవుతుంది’’ అని పేర్కొన్నారు.