మీసా భారతి దెబ్బా.. మజాకా!
లాలూ ప్రసాద్ పెద్ద కూతురు మీసా భారతి దెబ్బకు ఆర్జేడీ ఎంపీ ఒకరు ఏకంగా తన ఇల్లు వదిలి వెళ్లిపోయి.. మళ్లీ తిరిగొస్తే ఒట్టు! అంతేకాదు, ఆయన ఆర్జేడీకి రాజీనామా కూడా చేసిపారేశారు. తన పెద్ద కూతురు మీసా భారతి ఈసారి బీహార్లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని లాలూ ప్రకటించారు. దాంతో లాలూకు రెండు దశాబ్దాలుగా సన్నిహితుడిగా పేరొందిన రాం కృపాల్ యాదవ్ తాను పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఆయన పాటలీపుత్ర నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దాంతో.. మీసాభారతి నేరుగా రాంకృపాల్ యాదవ్ ఇంటికి వెళ్లి, రాజీ ప్రయత్నాలు చేద్దామనుకున్నారు. కానీ ఆమె వస్తున్న విషయం తెలిసి రాంకృపాల్ బయటకు వెళ్లిపోయారు.
''నేను రాంకృపాల్ బాబాయ్ని కలవాలని వచ్చాను. ఆయన నా అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం కావాలంటే నేను పోటీనుంచి తప్పుకుంటా. చాచాతో మాట్లాడకుండా ఇక్కడినుంచి వెళ్లేది లేదు. ఎప్పటికైనా ఆయన తిరిగొస్తారు'' అని ఆమె చెప్పారు. కానీ ఎంతసేపటికీ ఆయన రాకపోవడంతో మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయారు. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) కింద లాలూ ప్రసాద్ ఎమర్జెన్సీ సమయంలో 1975-77 మధ్య కాలంలో జైల్లో ఉన్న లాలూ, తన పెద్ద కూతురికి ఆ పేరే పెట్టేశారు. లాలూకు మొత్తం తొమ్మిది మంది సంతానం ఉండగా, వారిలో పెద్దకుమార్తె మీసా (37). ఆయన కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నా.. వాళ్లకింకా ఎన్నికల్లో పోటీచేసేంత వయసు లేదు.