లండన్ ఎయిర్పోర్టులో 8 గంటలు రాందేవ్ నిర్బంధం
యోగా గురు బాబా రాందేవ్కు ఇంగ్లండ్లో చేదు అనుభవం ఎదురైంది. లండన్లోని హీత్రో ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు. శనివారం రాందేవ్ను విడిచిపెట్టినట్టు ఆయన ప్రతినిధి ఎస్.కె.తేజరావాలా తెలిపారు. వేధింపులకు గురైనట్టు 'స్వామీజీ' భావించారని తెలిపారు.
కస్టమ్స్ అధికారులు రాందేవ్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్రిటన్కు విజట్ వీసాపై వచ్చారా లేక బిజినెస్ వీసాపైనా అన్న విషయం గురించి ఆరా తీశారు. ఆయన వెంట తీసుకెళ్లిన ఆయుర్వేద మందుల గురించి ప్రశ్నించారు. రాందేవ్ తన వెంట నాలుగు జతల దుస్తులు, కొన్ని మందులు, పుస్తకాలు తీసుకెళ్లారు.
'తనను ఎందుకు నిర్బంధించారని బాబా పలుసార్లు అధికారులను ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడూ నేరం, అనైతిక పనులు చేయలేదని చెప్పారు. ఐతే అధికారులకు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు' అని తేజరావాలా చెప్పారు. 125 కోట్ల భారతీయులందరికీ ఇది అవమానకర సంఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేళ్లుగా బాబా పలుసార్లు ఇంగ్లండ్ వెళ్లి యోగా తరగతులు నిర్వహించారని తెలిపారు. పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు.