మాట నిలబెట్టుకున్న బీజేపీ
లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మాట నిలుపుకుంది. ఉత్తరప్రదేశ్ లో తాము అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో మంత్రి గాయత్రి ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన మాట నిజమైంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని లక్నోలో అరెస్ట్ చేశారు. తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదు కావడంతో ఫిబ్రవరి 27 నుంచి ఆయన పరారీలో ఉన్నారు.
కేబినెట్ లో ప్రజాపతిని ఎలా కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ లేఖ రాసినా స్పందన కనిపించలేదు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రజాపతిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కమలం పార్టీ మాట నిలబెట్టుకోవడం విశేషం.
అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. మాట్లాడుతూ... తాము యూపీలో అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో ప్రజాపతి అరెస్ట్ ఒకటని చెప్పారు. అతణ్ని నరకంలో ఉన్నా పట్టితెచ్చి జైలుకు పంపుతామన్నారు. ప్రజాపతి గత నెల 27న పోలింగ్ కేంద్రానికొచ్చి ఓటేశారని, అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు.