బోర్డు రూం నుంచి కోర్టెక్కిన మిస్త్రీ వ్యవహారం!
బోర్డు రూం నుంచి కోర్టెక్కిన మిస్త్రీ వ్యవహారం!
Published Tue, Oct 25 2016 6:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని ఉన్నపళంగా తప్పించడం తదుపరి దేశీయ కార్పొరేట్ రంగంలో పలు ఊహించని పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి. బోర్డు రూం సైలెంటుగా జరిగిన ఈ రగడ.. కోర్టు గడప తొక్కే స్థాయికి వెళ్లింది. మిస్త్రీని తొలగిస్తూ గ్రూప్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, దీనిపై పల్లోంజి గ్రూప్, సైరస్ మిస్త్రీ కోర్టుకు వెళ్లనున్నట్టు వదంతులు వచ్చాయి. దీంతో థర్డ్ పార్టీ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే, కోర్టులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు టాటా గ్రూప్ ముందస్తు జాగ్రత్తలు పడింది. బొంబాయి హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లలో టాటా గ్రూప్ కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్తో కోర్టును ఆశ్రయించిన వారి వాదనలే కాక, ఇతరుల అభిప్రాయాలను కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకునే వీలుంటుంది. అనంతరం సైరస్ మిస్త్రీ కూడా రతన్టాటాకు, టాటా సన్స్కు, సర్ దోరబ్జీ సన్స్కు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లు దాఖలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ వదంతులను సైరస్ మిస్త్రీ, పల్లోంజి గ్రూప్ కొట్టేసింది. తాము ఎలాంటి కేవియట్ పిటిషన్లను దాఖలు చేయలేదని పల్లోంజి గ్రూప్ పేర్కొంది.
ఎల్లప్పుడూ ప్రశాంతంగా జరిగే టాటా సన్స్ బోర్డు సమావేశాలు, సోమవారం నాటి భేటీలో మాత్రం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిన్న చిన్న ఉద్యోగులకే నోటీసులు ఇచ్చిన తర్వాత తొలగించే కంపెనీలు, అత్యున్నత స్థాయి వారికి ఎంతో గౌరవమైన రీతిలో గుడ్ బై చెబుతాయి. కానీ టాటా గ్రూప్ అలా చేయలేదు. ఎలాంటి నోటీసులు లేకుండానే, అగౌరవమైన రీతిలో సైరస్ మిస్త్రీని తప్పించింది. దాని వెనుక కారణాలు కూడా టాటా గ్రూప్ వెల్లడించలేదు. లాభాపేక్ష లేని వ్యాపారాలకు సైరస్ మిస్త్రీ నిర్లక్ష్యం వహిస్తూ.. వాటికి ఉద్వాసన పలుకతున్నాడనే ఆరోపణలతో ఆయన్ను తప్పించినట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాటిలో మేజర్ డీల్ యూరప్లో టాటా స్టీల్ వ్యాపారాలను విక్రయించడమేనని పేర్కొన్నాయి. ఈ నిర్ణయం సైరస్ మిస్త్రీ నేతృత్వంలోనే జరిగింది.
ప్రస్తుతం టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను ఆ గ్రూప్ నియమించింది. నాలుగు నెలలో శాశ్వత చైర్మన్ను నియమించేందుకు ఓ కమిటీని కూడా గ్రూప్ ఎంపికచేసింది. కోర్టు రూంలో ఇదంతా సైలెంట్గానే జరిగింది. ఆ వార్త బయటికి వచ్చే దాక, మార్కెట్లకు గానీ, ఇతర కంపెనీ సంబంధిత వర్గాలకు కానీ ఈ న్యూస్ తెలియదు. ఎప్పుడైతే బోర్డు సైరస్ మిస్త్రీని తొలగిస్తున్నట్టు నిర్ణయించిందో అనంతరం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మంగళవారం స్టాక్ మార్కెట్లలో కూడా ఎఫెక్టు కనిపించింది. టాటా గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. మిస్త్రీని తొలగించిన అనంతరం రతన్ టాటా, గ్రూప్ కంపెనీల సీఈవోలతో మంగళవారం భేటీ అయ్యారు. తమ తమ వ్యాపారాలపై దృష్టిసారించాలని ఆ గ్రూప్ అధినేతలను రతన్ టాటా ఆదేశించారు. కానీ సైరస్ మిస్త్రీని ఎందుకు తొలగించారనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ రగడ కోర్టు మెట్లెక్కింది. తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
Advertisement
Advertisement