న్యూఢిల్లీ: టాటా గ్రూప్, ఉద్వాసనకు గురైన మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోంది. తాజాగా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాపై మిస్త్రీ మరిన్ని ఆరోపణలు చేశారు. టాటా హయాంలో పెట్టుబడులకంటూ ఓ వ్యూహమంటూ ఉండేది కాదని మిస్త్రీ పేర్కొన్నారు. టెలికం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్, ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత స్థాయిలో గ్రూప్ విలువ నాశనమైందని మిస్త్రీ ఆరోపించారు. 2012 డిసెంబర్‌లో టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినప్పట్నుంచీ రతన్ టాటాపై పెట్టిన వ్యయాలన్నీ ఆయన కంపెనీకి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.
టాటా గ్రూప్ అఫిడవిట్లకు ప్రతిగా మిస్త్రీ కుటుంబ సంస్థలు ఈ మేరకు సుప్రీం కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశాయి. 2016 అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్‌గా టాటా సన్స్ తొలగించడం, అటుపైన సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అది చెల్లదంటూ నేషనల్ కంపెనీ లా అప్పి లేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపైనే మే 29న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా తమ వాదనలు తెలియజేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది. మిస్త్రీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కంపెనీకి నష్టాలు వాటిల్లాయని, అందుకే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని టాటా గ్రూప్ పేర్కొనడాన్ని మిస్త్రీ తప్పు పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment