జీరో వడ్డీ స్కీమ్‌లు వద్దు | RBI hints at more steps to ease liquidity | Sakshi
Sakshi News home page

జీరో వడ్డీ స్కీమ్‌లు వద్దు

Published Thu, Sep 26 2013 12:22 AM | Last Updated on Wed, Aug 1 2018 4:13 PM

జీరో వడ్డీ స్కీమ్‌లు వద్దు - Sakshi

జీరో వడ్డీ స్కీమ్‌లు వద్దు

ముంబై: ఖరీదైన సెల్‌ఫోన్ కావాలా.. ముందుగా పైసా చెల్లించక్కర్లేదు! పైగా ఎలాంటి వడ్డీ లేకుండానే సమాన నెలసరివాయిదా(ఈఎంఐ)లలో డబ్బు కట్టేయొచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు! ఇటీవలి కాలంలో ఇలాంటి జీరో వడ్డీ ఈఎంఐ స్కీమ్‌లు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లకే కాదు టీవీలు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయ సంస్థలు ఈ తరహా స్కీమ్‌లతో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు వీటన్నింటికీ ఆర్‌బీఐ చెక్ చెప్పింది. కన్సూమర్ గూడ్స్ కొనుగోళ్లకు సంబంధించి జీరో శాతం వడ్డీరేట్ల పథకాలను నిషేధిస్తున్నట్లు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో పండుగ సీజన్‌లో అమ్మకాల జోష్‌పై నీళ్లుచల్లినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
 
 వినియోగదారుల మేలుకే...
 కాగా, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై కూడా ఎలాంటి అదనపు చార్జీలనూ వసూలు చేయరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘ఒక ఉత్పత్తి అమ్మకానికి సబంధించి వడ్డీరేట్ల స్వరూపాన్ని బ్యాంకులు దెబ్బతీయకూడదు. ఇలాంటి చర్యల వల్ల ధరల విధానంలో పారదర్శకత లేకుండా పోతుంది. వినియోగదారుడు అన్ని అంశాలూ తెలుసుకొని అంతిమంగా తగిన నిర్ణయం తీసుకోవాలంటే వాస్తవ ధర అనేది చాలా ముఖ్యం’ అని ఆర్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలు జీరో వడ్డీరేట్లు అనే విధానమే పూర్తిగా తప్పుదోవపట్టించే అంశమని కూడా ఆర్‌బీఐ అంటోంది. ‘ఏదైనా ఉత్పత్తి, సంబంధిత విభాగం విషయంలో ప్రాసెసింగ్ చార్జీలు, ఎంత వడ్డీరేట్లు విధిస్తున్నారనేది కచ్చితంగా, పారదర్శకంగా తెలియజేయాల్సిందే.
 
 కస్టమర్లకు ఏదో ఒక ఆశజూపి వాళ్ల జేబు గుల్ల చేసేందుకే ఇలాంటి ‘జీరో’ స్కీమ్‌లు పుట్టుకొస్తున్నాయని కూడా ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. వాస్తవానికి జీరో వడ్డీ కింద ఆఫర్ చేస్తున్న ఈఎంఐ స్కీమ్‌లలో ప్రాసెసింగ్ చార్జీల రూపంలో వడ్డీని నిగూఢంగా ఉత్పత్తి ధరకే జతచేసి విక్రయ సంస్థలు మాయ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి డబ్బు చెల్లించి కొనుగోలు చేయలేని వినియోగదారులు అసలు ఉత్పత్తి ధరను పట్టించుకోకుండా... వడ్డీలేకుండా సులభ వాయిదాలకు మొగ్గుచూపుతున్నట్లు ఆర్‌బీఐ పరిశీలనలో వెల్లడైంది. ఇదేకాదు.. కొన్ని బ్యాంకులు కూడా ఇలాంటి మసిపూసే కొన్ని చర్యలకు పాల్పడుతున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఏదైనా ఉత్పత్తి కొనుగోలు కోసం కస్టమర్లకు ఆఫర్ చేసే రుణంపై విధించే వడ్డీరేటులోనే అదనపు రుసుము(ప్రాసెసింగ్, కమిషన్ చార్జీ ఇతరత్రా) వడ్డింపులను కలిపి ఈఎంఐలను వసూలు చేస్తున్నాయనేది
 
 ఆర్‌బీఐ పరిశీలన.
 రిటైల్ ఉత్పత్తులకు విభిన్న వడ్డీరేట్లు వద్దు...
 ఒకే విధమైన ప్రొడక్ట్, సమాన కాలవ్యవధిగల రుణాలకు ఒక్కో కస్టమర్‌కు ఒక్కో విధమైన వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులపై కూడా ఆర్‌బీఐ దృష్టిసారించింది. ఇటువంటి డిఫరెన్షియల్ వడ్డీరేట్ల విధానాన్ని రిటైల్ ఉత్పత్తులకు ఇచ్చే రుణాలకు వర్తింపజేయరాదని కూడా ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ముఖ్యంగా రిటైల్ ఉత్పత్తుల విషయంలో కస్టమర్ రిస్క్‌తత్వంతో సంబంధంలేకుండా ఒకేవిధమైన(ఫ్లాట్) వడ్డీరేటును అమలు చేయాలని తేల్చిచెప్పింది.
 
 మరోపక్క, ఏదైనా వడ్డీరేట్ల తగ్గింపు ఆఫర్‌లపైనా కొరఢా ఝుళిపించింది. కస్టమర్లకు ఉత్పత్తి కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని అందించాలంటే... విక్రయ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్‌లను పరిగణనలోకి తీసుకున్నాకే రుణ మొత్తాన్ని మంజూరు చేయాలని స్పష్టీకరించింది. రుణ చెల్లింపుపై ఏదైనా మారటోరియం వంటి ప్రయోజనం ఉంటే... బ్యాంకులు ముందుగానే తగిన రీపేమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు అనేది కూడా మారటోరియం వ్యవధి తర్వాత నుంచే ఉండాలని... వడ్డీరేటును పూర్తి కాలవ్యవధికి సర్దుబాటు చేయకూడదని కూడా నోటిఫికేషన్‌లో తెలిపింది. ఉత్పత్తిపై డీలర్లు, తయారీ కంపెనీలు అందించే డిస్కౌంట్లు, ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా లభ్యమయ్యేలా రుణాలను అందించే బాధ్యత బ్యాంకులదేనని ఆర్‌బీఐ పేర్కొంది.
 
 డెబిట్ కార్డులపై...
 కొన్ని విక్రయ కేంద్రాల(పాయింట్ ఆఫ్ సేల్స్) వద్ద ఏదైనా ఉత్పత్తి/సేవల కొనుగోలు కోసం డెబిట్ కార్డుల ద్వారా సొమ్ము చెల్లిస్తే... ఆ మొత్తం లావాదేవీపై కొంత శాతాన్ని అదనపు ఫీజుకింద వసూలు చేస్తున్న ఉదంతాలు కూడా ఆర్‌బీఐ దృష్టికెళ్ళాయి. ఇలాంటి రుసుములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. అదనపు చార్జీలను వడ్డించే విక్రయ సంస్థలతో బ్యాంకులు ఒప్పందాలను తెగదెంపులు చేసుకోవాలని ఆదేశించింది. ఇటువంటి చర్యలు, ఉత్పత్తుల విక్రయం అనేది పారదర్శక, నిష్పాక్షిక ధరల విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదని... వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేదని కూడా ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. వీటివల్ల రుణాలు, వడ్డీరేట్లకు సంబంధించిన మూల ఉత్తర్వుల్లోని నిబంధనలను తుంగలోకి తొక్కినట్లవుతుందని  పేర్కొంది. కస్టమర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవహరించవద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ హితవుపలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement