వడ్డీ రేట్ల పెంపు సిగ్నల్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారంనాటి తన రెండవ త్రైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు పెంపునకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ మేరకు సంకేతాలను ఇచ్చారు. తద్వారా ఆర్‌బీఐ తక్షణం ధరల కట్టడికే ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో వృద్ధికి విఘాతం కలగకుండా తగిన చర్యలు ఉంటాయని సైతం సూచించారు. ఈ మేరకు ఆర్‌బీఐ సోమవారం స్థూల ఆర్థిక-ద్రవ్య పరపతి పరిణామాల నివేదికను ఆవిష్కరించింది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఇబ్బందులు కొనసాగుతున్నాయని నివేదికలో వివరించింది. అలాగే వ్యవస్థీకృత సంస్థల్లో నియంత్రణాపరమైన లోటుపాట్లు ఉన్న విషయాన్ని ఎన్‌ఎస్‌ఈఎల్ (నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్) సంక్షోభం బట్టబయలు చేస్తోందని సైతం విశ్లేషించింది.
తగిన చర్యలు...: ‘ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే దిశలో అసాధారణ ద్రవ్య చర్యలు అమలవుతున్నాయి. పరిస్థితిని మరింత మెరుగుపరిచే రీతిలో తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కోణంలో వృద్ధి-ద్రవ్యోల్బణం మధ్య సమతౌల్యతను, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటాం’ అని నివేదికలో రాజన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యలోటు సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశమూ ఉంది.. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు ఎప్పటికప్పుడు సవాళ్లేనని నివేదిక పేర్కొంది. ‘తగిన స్థాయికన్నా తక్కువకు వృద్ధి పడిపోయింది. దీని పునరుత్తేజానికి తగిన పటిష్ట పరపతి, ద్రవ్య, నియంత్రణా విధానాలు అవసరం. డిమాండ్ కట్టడి దిశలో ఇంధన ధరల పెంపు, ప్రాజెక్టుల తక్షణ అమలు వంటి చర్యలు సైతం ఈ దిశలో మంచి ఫలితాలను ఇస్తాయి’ అని రాజన్ పేర్కొన్నారు.
ద్వితీయార్ధం బాగుండే అవకాశం: మంచి రుతుపవన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ కొంత రికవరీ సాధిస్తుందని భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఎగుమతుల్లో వృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుదల అవకాశాలు సైతం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
క్యాడ్ మెరుగుపడొచ్చు: కాగా రూపాయి క్షీణతలకు ప్రధాన కారణాల్లో ఒకటైన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి ఎగుమతులు-దిగుమతుల డేటాను పరిశీలిస్తే రెండవ క్వార్టర్‌లో పరిస్థితి మెరుగుపడవచ్చన్న సంకేతాలు ఉన్నాయని తెలిపింది. ఈ లోటు 3.5%కి దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్(ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8%(88.2 బిలియన్ డాలర్లు). ఈ ఏడాది ఈ పరిమాణాన్ని 3.7%కి(77 బిలియన్ డాలర్లు) కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుత పరిస్థితి...
పాలసీ సమీక్ష రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును మరో పావు శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు కొందరు భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న ఈ రేటు 7.75 శాతానికి చేరుతుంది. అయితే వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతా (లిక్విడిటీ) సమస్యా తలెత్తకుండా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు పావు శాతం తగ్గించే అవకాశం ఉందని కూడా నిపుణుల అంచనా. ఇదే జరిగితే ఈ రేటు ప్రస్తుత 9 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గవచ్చని భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా తన మొదటి సమీక్ష సందర్భంగా రాజన్ రెపో రేటును పావుశాతం పెంచారు. ధరల కట్టడే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
వృద్ధి రేటు అంచనా 4.8 శాతమే.. భారీగా కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.8%గా ఉంటుందని ఆర్‌బీఐ నియంత్రణలోని సర్వేయర్లు అంచనా వేశారు. ఇంతక్రితం ఈ అంచనాలు 5.7%. ఆర్‌బీఐ నివేదిక ఈ వివరాలను తెలియజేసింది. 2012-13లో నమోదయిన వృద్ధి 5% కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ప్రపంచ బ్యాంక్ వంటి పలు విదేశీ సంస్థలు భారత్ వృద్ధి రేటును 4.3-5.9 శ్రేణిలో అంచనా వేయడం తెలిసిందే.