న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన కీలకమైన బిల్లులను వాయిదావేయకుండా...ఆమోదముద్ర వేయాలని రాజకీయ పార్టీలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. బుధవారం ఇక్కడ ఢిల్లీ ఆర్థిక సదస్సు-2013లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2014 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పలేం. రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. ఇప్పుడుగనుక ముఖ్యమైన బిల్లులు వాయిదాపడితే.. రానున్న ప్రభుత్వ హయాంలో ఆమోదముద్ర లభించడం అత్యంత సవాలుగా మారుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అంశం’ అని రాజన్ పేర్కొన్నారు. అదేవిధంగా భారీ ప్రాజెక్టుల్లో జాప్యాలు తొలగించి.. తక్షణం పట్టాలెక్కించేలా చూడాలని కూడా ఆయన చెప్పారు. లేదంటే వీటి వ్యయాలు అదుపుతప్పి రానున్న ప్రభుత్వానికి మరింత సమస్యాత్మకంగా మారుతాయన్నారు.
సబ్సిడీలకు కోతపెట్టాలి..: కీలక బిల్లులు ఆమోదించడంతోపాటు వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం నడుంబిగించాలని రాజన్ సూచించారు. డీజిల్ ధరల పెంపు, సామాజిక పథకాలకు సంబంధించిన సబ్సిడీల్లో కోతపెట్టడం చాలా ముఖ్యమని చెప్పారు.
ఈ ఏడాది 5 శాతం వృద్ధి రేటు అంచనా...
దేశ ఆర్థిక వ్యవస్థలో రికవరీ, స్థిరీకరణ సంకేతాలు కనబడుతున్నాయని రాజన్ పేర్కొన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతంగా ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ద్రవ్యలోటును లక్ష్యాన్ని(4.8 శాతం) ప్రభుత్వం సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పాలసీలో ద్రవ్యోల్బణం, లిక్విడిటీపైనే దృష్టి...
రానున్న పరపతి విధాన సమీక్ష(ఈ నెల 18న)లో ఆర్‌బీఐ ప్రధానంగా ధరలకు కళ్లెం, వ్యవస్థలో నగదు సరఫరా(లిక్విడిటీ) మెరుగుపరచడంపైనే దృష్టిపెడుతుందని రాజన్ చెప్పారు. తద్వారా మరోవిడత వడ్డీరేట్ల పెంపు/యథావిధిగా కొనసాగించే సంకేతాలు ఇచ్చారు. ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటంతో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా రెండు సమీక్షల్లో కూడా పాలసీ వడ్డీ రేట్లను రాజన్ పావు శాతం చొప్పున పెంచారు. టోకు ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7 శాతానికి(8 నెలల గరిష్టం), రిటైల్ ద్రవ్యోల్బణం 10.09% కు ఎగబాకిన సంగతి తెలిసిందే.
కావాలనే రుణాలు ఎగ్గొడితే వడ్డీ బాదుడు...
బ్యాంకులకు మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) పెరిగిపోతుండటంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్టవేయడంలో భాగంగా కావాలనే రుణాలు ఎగ్గొట్టేవారికి(డిఫాల్లర్ల) భవిష్యత్తులో రుణాలపై భారీగా వడ్డీరేట్లు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొండిబకాయిల పెరగుదలకు సంబంధించి వచ్చే వారంలో ఒక చర్చా పత్రాన్ని ఆర్‌బీఐ విడుదల చేయనుందని వెల్లడించారు. దీనిలో ఎన్‌పీఏల రికవరీకి పరిష్కార మార్గాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.