
కొనసాగుతున్న రిలయన్స్ హవా
ముంబై: మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతోంది. సోమవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు 6 శాతం లాభపడి రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇంట్రాడేలో బలమైన ర్యాలీ తో ఈ షేర్ ధర రూ 1,253.45 వద్ద దాదాపు 9 సంవత్సరాల గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ తొలిసారి రూ. 4.05 లక్షల కోట్లను దాటింది. 2008 జనవరి 18 తరువాత ఈ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి.
వరుసగా నాలుగు సెషన్ల లాభాలతో దాదాపు 17శాతం పుంజుకుంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రెండవస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టిసిఎస్ రూ 4.88 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్‌తో ప్రథమ స్థానంలో ఉంది. మరోవైపు బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్‌పై పాజిటివ్ అంచనాలను వ్యక్తం చేస్తోంది. అటు రిలయన్స్ అండతో స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్లు ప్రస్తుతం లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో28,940 వద్ద నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 8945వద్ద కొనసాగుతున్నాయి.
కాగా ఉచిత 4జీ సేవలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రిలయన్స్ జియో ఏప్రిల్ నుంచి అమలుకానున్న టారిఫ్ ప్లాన్లు , వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.