మహిళా మంత్రిని ‘చెత్త’ అన్న రేణుకాచౌదరి!
పార్లమెంటులో నేతల మధ్య దూషణల పర్వం శ్రుతి మించుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తన పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. రేణుకా చౌదరి, జైరాం రమేష్ ఇద్దరూ తనను చెత్త అన్నారని.. శుక్రవారం నాడు సభ వాయిదా పడిన తర్వాత ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వీళ్లిద్దరిపైనా రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్, రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. అసలు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఆ సభలోకి ఎలా వస్తారని అడిగారని అన్నారు. నిజానికి బాదల్ లోక్సభ ఎంపీయే అయినా.. మంత్రి కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడేందుకు ఆమెకు అర్హత ఉంటుంది.
అయితే.. రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాదల్ చేసేదంతా రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కచరా అనే పదం ఆమెకు ఎక్కడి నుంచి వినిపించిందని ప్రశ్నించారు. తాను ఇంగ్లీషులో మాట్లాడాను తప్ప హిందీలో కాదని అన్నారు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్లో ఓడిపోతున్నారని.. అందుకే ఓట్ల కోసం ఈ రాజకీయ డ్రామా చేస్తున్నారని అన్నారు.