పట్నా : భగ్లాపూర్ (బిహార్) మత ఘర్షణలకు సంబంధించి శనివారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అల్లర్లకు కారణంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని చౌబే(బీజేపీ) తనయుడు అర్జిత్ షాష్‌వత్ పోలీసులకు లొంగిపోయారు. అయితే ఆయన లొంగిపోలేదని.. తామే అరెస్ట్ చేసినట్లు భగ్లాపూర్ పోలీసులు ప్రకటించారు.
‘అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టాం. భగ్లాపూర్ పోలీసులు కూడా అతనిపై అరెస్ట్ వారెంట్‌తో వెతుకుతున్నారు. హనుమాన్ మందిర్ సమీపంలో అతన్ని అరెస్ట్ చేశాం. పద్ధతి ప్రకారం ఇప్పుడతని విచారణ చేపట్టాం’ అని అదనపు ఎస్పీ రాశేష్ దుబే మీడియాకు వెల్లడించారు. అర్జిత్ తనంతట తానే లొంగిపోయినట్లు.. మీడియాకు వెల్లడించిన విజువల్స్ స్థానిక మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఆరోపణలన్నీ అవాస్తవమని.. ఈ కేసులో తాను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని షాష్‌వత్ వెల్లడించారు.
మార్చి 17న అర్జిత్ షాష్‌వత్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ సందర్భంగా రెచ్చగొట్టే నినాదాలు చేయటంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రాళ్లు రువ్వుకోవటంతో పోలీసులతోపాటు స్థానికులు కూడా గాయపడ్డారు. అయితే ఆ ఘటనలకు.. అర్జిత్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తండ్రి, కేంద్ర మంత్రి అశ్విని చౌబే, పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మత ఘర్షణల వెనుక ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉందని చౌబే ఆరోపించారు.
ఇక ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని సీఎం నితీశ్ కుమార్ ఆదేశించటం.. అర్జిత్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికావటం.. కొద్ది గంటలకే అర్జిత్ అరెస్ట్.. ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment