కాంగ్రెస్‌వి ప్రతీకార రాజకీయాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు
- అందుకే పార్లమెంటును అడ్డుకుంటున్నారు..
- ఇదే తీరు కొనసాగితే.. భవిష్యత్తులో ఒక్క సీటూ గెలవలేరు
- ప్రధాన విపక్షంపై ప్రధాని మోదీ ధ్వజం
రుషీకేశ్/చండీగఢ్: పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతూ దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లడాన్ని అడ్డుకుంటోందన్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు వారిని ఘోరంగా ఓడించారు. అందుకు వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పార్లమెంటును సాగనివ్వడం లేదు. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు గమనించాలి.
రానున్నరోజుల్లోనూ వారికి తగిన గుణపాఠం నేర్పించాలి’ అన్నారు. చండీగఢ్, రుషికేశ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో శుక్రవారం మోదీ పాల్గొన్నారు. 40 మంది ఎంపీలు కుట్రపూరితంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటూ, ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని మోదీ కాంగ్రెస్ ఎంపీలపై మండిపడ్డారు. వారు చేసేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ‘లోక్‌సభ పైన ప్రజా జనసభ ఉంటుంది. అందుకే నా అభిప్రాయాల్ని ఇక్కడ ఈ జనసభలో వ్యక్తం చేస్తున్నా’నన్నారు. ‘ప్రతికూల రాజకీయాలకు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికి తేడా ఉంది. ప్రతిపక్షంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచిదే. కానీ ప్రతీకారాత్మక రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ తేడాను కాంగ్రెస్ గుర్తించాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి’ అని హితవు చెప్పారు. గతంలో బీజేపీ కూడా రెండే స్థానాలు గెలుచుకున్న సందర్భముందని, అయితే, బీజేపీ ఏనాడు ఇలా ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదని, సమస్యలపై పోరాడి ప్రజల హృదయం గెలుచుకుందని అన్నారు. ‘ప్రతిపక్షంలో కూర్చోవడానికి వారు(కాంగ్రెస్) ఇంకా అలవాటు పడలేదు. బీజేపీ ఇలా సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం మా కుటుంబ ఆస్తి. దాన్ని ఒక చాయ్‌వాలా.. ఒక పేదవాడి కొడుకు.. ఒక సామాన్యుడు మా నుంచి లాక్కోవడం ఏంటి..? అని వారు అసహనంతో ఉన్నారు. ఈ వైఖరి వారి పేదల వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోంది’ అని కాంగ్రెస్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా ఇప్పుడెక్కడా కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. చండీగఢ్ హౌసింగ్ బోర్డ్‌వారి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ.. 2022 నాటికి దేశంలోని నిరుపేదలకు కూడా గృహ వసతి కల్పించడం తన స్వప్నమన్నారు. ఈ సందర్భంగా ఒక మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇలాంటివాటి వల్ల సామాన్యులకు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు.
ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభం
చండీగఢ్ విమానాశ్రయంలో అధునాతన టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ప్రజలకు, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడ్తుందన్నారు. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లో ఈ విమానాశ్రయం ఎవరికి చెందుతుందన్న వివాదాన్ని ఆయన కొట్టేశారు.ఇథనాల్ ఉత్పత్తికి అనుమతి ..మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేసేందుకు త్వరలో పంజాబ్ రైతులకు కేంద్రం తరఫున అనుమతినిస్తామని మోదీ ప్రకటించారు. మొక్కజొన్న అధికంగా పండే పంజాబ్‌కు ఇది ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమన్నారు.
ములాయంపై మరోసారి ప్రశంసలు
పార్లమెంటు కార్యకలాపాలను కాంగ్రెస్ అడ్డుకోవడాన్ని తప్పుబట్టడం ద్వారా.. ప్రతిపక్ష నేత అయినప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సాధ్యమైనంత కృషి చేశారం’టూ సమాజ్‌వాదీ నేత ములాయంపై మోదీ మళ్లీ ప్రశంసలు గుప్పించారు. యూపీలో జరిగిన ఒక సభలో శుక్రవారం ప్రధాని పాల్గొన్నారు.
ఇబ్బంది కలిగించాను.. సారీ!
నగరంలో శుక్రవారం ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసేయించారు. చనిపోయిన తమవారిని ఖననం చేసేందుకు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మోదీ.. తన పర్యటనతో నగర ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ ట్విటర్లో క్షమాపణలు కోరారు. దీనిపై విచారణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు.