* సూపర్‌ఫైన్ బియ్యం కిలో రూ. 52
* గతేడాదితో పోల్చితే 25-30 శాతం పెరుగుదల
* కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచిన వ్యాపారులు
* ధరల నియంత్రణ పట్టని ప్రభుత్వం
* ప్రత్యేక కౌంటర్లలో నాణ్యత లేని ‘సర్కారీ బియ్యానికి’ డిమాండ్ కరువు
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొదటి శ్రేణి బియ్యం(నిజామాబాద్ సన్నాలు) కిలో బియ్యం ధర రూ.53-56 వరకూ పలుకుతోంది. సూపర్ ఫైన్‌గా పరిగణించే నిజామాబాద్ సన్నాలును పక్కనపెడితే మసూరి బియ్యం మొదటి రకం హైదరాబాద్‌లో వ్యాపారులు కిలో రూ.47-50 ధరతో అమ్ముతున్నారు. రెండో రకం బియ్యం కిలో రూ. 44-46 ధర ఉంది. మూడో రకం బియ్యం కిలో రూ.42-44 ధర ఉంది.
చాలామంది వ్యాపారులు పాత బియ్యం పేరిట ఉప్పుడు బియ్యం (స్టీమ్ రైస్) కూడా ఇదే ధరకు అమ్ముతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రం ఉప్పుడు బియ్యాన్ని కిలో రూ.42కు అమ్ముతున్నారు. క్వింటాల్ లెక్కన హోల్‌సేల్ దుకాణాల్లో కొనుగోలు చేసినా మసూరి పాత బియ్యం(నంబర్ వన్ క్వాలిటీ) రూ.4,500కు తగ్గడం లేదు. జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో క్వింటాల్‌పై రూ.300 నుంచి 500 (కిలోపై రూ. 3 నుంచి 5 రూపాయలు) ఎక్కువ ధర పలుకుతోంది. గత ఏడాది నంబర్ వన్ క్వాలిటీ బియ్యం కిలో రూ. 36-38 ధర ఉండేది. ఇప్పుడు ఇవే బియ్యం కిలో రూ. 53 నుంచి 56 వరకూ అమ్ముతున్నారు. గత ఏడాదితో పోల్చితే సగటున 25 నుంచి 30 శాతం వరకూ బియ్యం ధరపెరిగిందని వ్యాపారులే చెబుతున్నారు.
బ్లాక్‌మార్కెటింగ్‌తో ధరలకు ఊతం
నిత్యావసర వస్తువైన బియ్యం ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. వర్షాభావం, వరి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల గత రెండేళ్లలో ధాన్యం దిగుబడి తగ్గింది. దీనికి తోడు వరి కోతలు పూర్తికాగానే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు స్టాకును దాచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు విపరీతంగా పెంచేశారు. ధాన్యం సీజన్‌లో (జనవరిలో) మసూరి కొత్త బియ్యం క్వింటాల్ రూ.2,200-2,400 మధ్య ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.4,300కు పెరిగింది. బ్లాక్‌మార్కెటింగ్ వల్లే బియ్యం ధరలు నింగినంటాయన్నది బహిరంగ రహస్యమే. విపరీతంగా పెరిగిన ధరల్లో బియ్యం కొనుగోలు చేయడం వేతన జీవులు, అల్పాదాయ వర్గాలకు పెనుభారంగా మారింది. బ్లాక్‌మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసి బియ్యం ధరలను నియంత్రించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. అల్పాదాయ వర్గాలకు బియ్యంను సరసమైన రేట్లకు అందించేందుకు మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వ ఇచ్చిన హామీ ప్రకటనలకే పరిమితమైంది.
ప్రత్యేక కౌంటర్లలో బియ్యానికి డిమాండ్ కరువు
పౌరసరఫరాల శాఖ మిల్‌పాయింట్లు, రైతు బజార్లు తదితర చోట్ల ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో కిలో రూ.30కి సోనామసూరి, బీపీటీ బియ్యం విక్రయిస్తున్నారు. అయితే, నాణ్యత కొరవడడం వల్ల ఈ బియ్యానికి గిరాకీ ఉండటం లేదు. వ్యాపారుల వద్ద నుంచి రూ. 42-50 ధర చెల్లించి ప్రజలు కొంటున్నారు. నాణ్యత లేని బియ్యం అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఈ బియ్యం నాణ్యమైనవైతే మేమంతా వ్యాపారుల వద్ద అధిక ధరకు ఎందుకు కొంటాం. ప్రత్యేక కౌంటర్లలో అమ్ముతున్నవి పనికిరాని బియ్యమైనందునే వాటిని కొనడం లేదు’ అని విజయనగర్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి నిర్మల, లెక్చరర్ వాణి ‘సాక్షి’తో అన్నారు.
కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధర
ఉల్లి ధర కన్నీరు తెప్పిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ. 50-52 ఉంది. ఇటీవల కాలం వరకూ రూ. 20 లోపు ఉన్న ఉల్లి ధర భారీగా పెరగడంతో పేదలు, చిరు వేతన జీవులు ఇబ్బం ది పడుతున్నారు. చింతపండు ధర కూడా బాగా పెరిగింది. కిలో రూ.60 ఉన్న చింతపండు ఇప్పుడు రూ.90కి చేరింది.
భగ్గుమంటున్న బియ్యం !
Published Thu, Oct 17 2013 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement