బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావును ఎందుకు అరెస్టు చేయటం లేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు మొండి మురళీకృష్ణ, దుర్గాబాయి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిషితేశ్వరి మృతి ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. శనివారం యూనివర్సిటీలో రిషితేశ్వరి తల్లిదండ్రులు ఇన్‌చార్జి వీసీ బి.ఉదయలక్ష్మిని కలిశారు.
అనంతరం వారు 'సాక్షి'తో మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కమిటీ చేసిన సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ బాబూరావు నిర్లక్ష్యం ఉందని, ఆయన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయాలని. .. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో పేర్కొందని మీడియాలో కథనాలు వచ్చాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం బాబూరావును విధుల నుంచి తొలగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు తాము అందజేయలేమని పేర్కొన్నారు. రిషితేశ్వరి రాసుకున్న రెండో డైరీని, ఈ కేసులో నిందితులైన విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ బాబూరావు కలిసి ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా ఉదయలక్ష్మికి అందజేసినట్లు రిషితేశ్వరి తల్లిదండ్రులు వివరించారు. అనంతరం గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం మధ్యాహ్నం ఉదయలక్ష్మిని కలిసి, రిషితేశ్వరి మృతి కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, చేపడుతున్న చర్యలను వివరించినట్లు సమాచారం.