uday lakshmi
-
వర్సిటీలో ఆత్మహత్యలు నివారిస్తాం
గుడివాడ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇకపై ఏవిధమైన ఆత్మహత్యలు జరగకుండా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ బి.ఉదయలక్ష్మి అన్నారు. స్థానిక కేటీఆర్ మహిళా కళాశాలలో సోమవారం నిర్వహించిన ఎన్విరాన్మెంట్ స్టడీస్‌కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు, యాజమాన్యం మధ్య సరైన సంబంధాలు లేకపోవడం వలనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. యూనివర్సిటీలోకి కొంతమంది బయట వ్యక్తులు రావడం వలన ర్యాగింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలో ఇప్పటికే పలుమార్పులు తెచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే యూనివర్సిటీ చుట్టూ సోలార్ విద్యుత్‌తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థినులు, మహిళలు రాగింగ్ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టి దాని ద్వారా ఆకతాయిల చేష్టలను కట్టడి చేస్తున్నామన్నారు. మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించి రాగింగ్‌పై ఉన్న భయాన్ని పోగొడతామన్నారు. యూజీసీ నిధులతో యూనివర్సిటీలో రూ.2.5 కోట్లతో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హాస్టల్స్‌లో ఏవిధమైన అవకతవకలు జరగకుండా ఉండేందుకు అటెండెన్స్ విషయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.బి.సుజాత, ఏఎన్నార్ కాలేజి ప్రిన్సిపాల్ ఎస్.శంకర్ పాల్గొన్నారు. -
బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావును ఎందుకు అరెస్టు చేయటం లేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు మొండి మురళీకృష్ణ, దుర్గాబాయి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిషితేశ్వరి మృతి ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. శనివారం యూనివర్సిటీలో రిషితేశ్వరి తల్లిదండ్రులు ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మిని కలిశారు. అనంతరం వారు 'సాక్షి'తో మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కమిటీ చేసిన సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ బాబూరావు నిర్లక్ష్యం ఉందని, ఆయన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయాలని. .. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో పేర్కొందని మీడియాలో కథనాలు వచ్చాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం బాబూరావును విధుల నుంచి తొలగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు తాము అందజేయలేమని పేర్కొన్నారు. రిషితేశ్వరి రాసుకున్న రెండో డైరీని, ఈ కేసులో నిందితులైన విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ బాబూరావు కలిసి ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా ఉదయలక్ష్మికి అందజేసినట్లు రిషితేశ్వరి తల్లిదండ్రులు వివరించారు. అనంతరం గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం మధ్యాహ్నం ఉదయలక్ష్మిని కలిసి, రిషితేశ్వరి మృతి కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, చేపడుతున్న చర్యలను వివరించినట్లు సమాచారం.