
టికెట్టు ఇవ్వకపోతే చచ్చిపోతా.. జాగ్రత్త!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వాలంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే భాయి దినేష్ శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం.. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని బెదిరించారు. టికెట్ ఇవ్వని పక్షంలో ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలోనే ఆత్మాహుతి చేసుకుంటానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన భోజ్పూర్ జిల్లాలోని జగదీష్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2010 అసెంబ్లీ ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన భగవాన్ సింగ్ కుష్వాహాను తన స్థానం నుంచి బరిలోకి దించాలని ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ భావిస్తున్నట్లు వినిపించడంతో ఆయన నిరసన ప్రారంభించారు. స్థానిక మీడియాలో కూడా తనకు టికెట్ ఇవ్వరంటూ కథనాలు వచ్చాయన్నారు. ఆర్జేడీ తన తొలి జాబితాను శనివారమే విడుదల చేస్తుందని అనుకుంటున్నారు. బిహార్లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 8వ తేదీన విడుదలవుతాయి.