భువనేశ్వర్‌లో బస్సు ప్రమాదం
భువనేశ్వర్: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ధౌలి కొండ ప్రాంతం నుంచి టూరిస్టు బస్సు జారిపడింది. పశ్చిమ బెంగాల్ మెదీనాపూర్ నుంచి పర్యాటకులతో వచ్చిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ విచారకర సంఘటన మంగళవారం సంభవించింది. ఈ సంఘటనలో 35 మంది గాయపడ్డారు. కొండపై శాంతి స్థూపం సందర్శన ముగించుకుని వస్తుండగా మలుపులో అదుపు తప్పి బస్సు కొండ నుంచి దిగువ ప్రాంతానికి జారడంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రి, కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లోగడ పలుసార్లు పర్యాటక బస్సులు జారి ఇటువంటి ప్రమాదాలకు గురైన దాఖలాలు ఉన్నాయి.
చర్యలు శూన్యం
బంగారు త్రిభుజం పర్యటన కింద దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. ధౌలి కొండపైన ఉన్న శాంతి స్థూపం సందర్శించేందుకు వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో మలుపు తిరిగే చోట తరచూ బస్సులు జారి పడుతున్నాయి. కొండపైకి పర్యాటక బస్సుల్ని అనుమతించడం శ్రేయోదాయకం కాదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ ఈ మేరకు ఎటువంటి చర్యల్ని చేపట్టకపోవడం విచారకరం. 2012 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన పశ్చిమ బెంగాలు నుంచి విచ్చేసిన పర్యాటక బస్సు ఇదే ప్రాంతంలో 60 అడుగుల లోతుకు జారి పడింది. ఈ సంఘటనలో 7 మంది మరణించగా 40 మంది పైబడి గాయపడ్డారు. 2016 సంవత్సరం మే 23వ తేదీన ఇదే చోట ఇటువంటి విషాద సంఘటన జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం సంభవించింది. 35 మంది గాయపడ్డారు. బస్సు ఊగిసలాడే పరిస్థితిలో ఉండడంతో మరణాలు సంభవించనట్టు తదుపరి విచారణ తేల్చింది. మంగళవారం మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడం దురదృష్టకరం. పశ్చిమ బెంగాలు మెదినాపూర్ ప్రాంతం నుంచి 65 మంది పర్యాటకులతో వచ్చిన బస్సు తాజా ప్రమాదానికి గురైంది.
చర్యలకు ఆదేశిస్తాం: మంత్రి
ధౌలి ప్రాంతంలో తరచూ సంభవిస్తున్న పర్యాటక బస్సు దుర్ఘటనల నివారణకు విభాగం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా తెలిపారు. కొండపైకి భారీ బస్సుల్ని అనుమతించకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వివరించారు. కొండ దిగువ భాగంలో బస్సుల్ని నిలిపి చిన్న బస్సుల్లో పర్యాటకుల్ని కొండపైకి వెళ్లేందుకు అనుమతించేందుకు విభాగం చర్యలు చేపడుతుంది. బ్రేక్ ఫెయిల్, స్టీరింగ్ ఫెయిల్, టైర్లు పరిస్థితి వగైరా అంశాల్ని పరిశీలిస్తున్నారు. పరిశీలన మేరకు తదుపరి చర్యల్ని పేపడతామని స్థానిక ఎమ్‌వీఐ బిరాంచీ నారాయణ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిస్తే ప్రమాదానికి దారి తీసిన వాస్తవ కారణాలు, పరిస్థితులు స్పష్టం అవుతాయన్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవరుకు విచారణ జరిపితే దుర్ఘటన పూర్వాపరాలు తేటతెల్లం అవుతాయని నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి తెలిపారు.
నిందితుడు అరెస్టు
జయపురం: జయపురం సమితి ధన్‌పూర్ గ్రామంలో చింగుడు హరిజన్‌ను హత్య చేశాడన్న ఆరోపణతో నిందితుడు బుడు హరిజన్‌ను జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం సదర్ పోలీసు స్టేషన్ ఐఐసీ నిర్మళ మహాపాత్రో మంగళవారం విలేకరులకు తెలిపారు. నిందితుని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీన పరుచుకున్నట్టు చెప్పారు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత విభేదాలేనని వెల్లడించారు. నిందితుని మంగళవారం కోర్టులో హాజరు పరచినట్టు పేర్కొన్నారు. గతంలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆ గ్రామంలో తన చిన్నాన్న కుమారుడు చింగుడు హరిజన్‌ను బుడు హరిజన్ కత్తితో పొడిచి ఫరారీ అయ్యాడు. ఎట్టకేలకు పట్టుపడ్డాడు.