మంత్రులను తొలగించాల్సిందే! | Rohith Vemula suicide: Why did HRD ministry write 4 letters on the 'matter' to Hyderabad Central University? | Sakshi
Sakshi News home page

మంత్రులను తొలగించాల్సిందే!

Published Wed, Jan 20 2016 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

మంత్రులను తొలగించాల్సిందే!

మంత్రులను తొలగించాల్సిందే!

రోహిత్ ఆత్మహత్యకు వారే బాధ్యులు
హెచ్‌సీయూ విద్యార్థి ఆత్మహత్యపై భగ్గుమన్న భారతం
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నిరసనలు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్


సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, పంజాబ్‌లలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పంజాబ్‌లోని ఫగ్వారాలో ‘పంజాబ్ అంబేడ్కర్ సేన మూలవాసి’ సంస్థ, బీఎస్పీ విద్యార్థి సంఘం సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించి.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

దత్తాత్రేయను మంత్రి పదవినుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంలో జోక్యం  చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖరాశారు. అటు గుజరాత్ సెంట్రల్ వర్సిటీకి చెందిన 50 మంది దళిత విద్యార్థులు గాంధీనగర్‌లో శాంతిర్యాలీ నిర్వహించారు. వేముల రోహిత్‌ది వ్యవస్థాగతమైన హత్య అని ఆరోపించారు. ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరపాలని ఆందోళన నిర్వహించారు. ఇప్పటివరకు సస్పెండైన 10 మందిలో 9 మంది దళితులే ఎందుకున్నారని ప్రశ్నించారు. కుల, మతోన్మాద రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.బెంగళూరులోనూ దళిత విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ తీరువల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాయి. అటు తమిళనాడులోనూ నిరసనలు మిన్నంటాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతోపాటు దళిత విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. టీఎన్‌సీసీ దళిత విభాగం నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న శాస్త్రి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. రోహిత్ మృతి కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కూడా చెన్నైలో నిరసనలు చేపట్టింది. కాగా కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు యూనివర్సిటీ వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోవాలని ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో డిమాండ్ చేశారు. దళిత విద్యార్థుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.
అటు పుణేలోనూ.. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. హైదరాబాద్‌లో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై, ఔరంగాబాద్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ముంబై యూనివర్సిటీలో అంబేడ్కర్ యువజన సంఘాలు, అంబేడ్కర్ రాడికల్ సంఘం, రిపబ్లికన్ పాంథర్ తదితర సంఘాలు సంయుక్తంగా మంగళవారం ఆందోళన చేపట్టాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వీసీకి వినతిపత్రం అందించారు. మరోవైపు, ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాగ్‌పూర్‌కు చెందిన దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. అవసరమైతే నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.

మంత్రులను తొలగించాలి: కాంగ్రెస్
రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇద్దరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రధాన మంత్రి మోదీ వారిద్దరినీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమారి సెల్జా డిమాండ్ చేశారు. ఇరానీ విశ్వవిద్యాలయానికి పలు లేఖలు రాశారని, ఏబీవీపీని ప్రోత్సహించడానికి అనువుగా దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా దత్తాత్రేయ వ్యవహరించారని సెల్జా చెప్పారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, దళితుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు పని చేయ డం ఇది మొదటిసారి కాదన్నారు.
 
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ఆజంఖాన్
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. విద్యార్థి సూసైడ్ నోట్ కొత్త అనుమానాలకు తావిస్తోందని.. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని అనుబంధ సంస్థలే బాధ్యతవహించాలన్నారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీ వంటి సంస్థలను మూసేయించాలని సంఘ్ పరివార్ సంస్థలు యత్నిస్తున్నాయన్నారు.ఈకేసులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని ఆజంఖాన్ కోరారు.
 
టీఎంసీ సంఘీభావం
రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు తృణమూల్ కాంగ్రె స్ ఇద్దరు సభ్యుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపనుంది. ఫోన్‌లో సంఘీభావం తెలిపినా.. ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుందని విద్యార్థి బృందం కోరటంతో టీఎంసీ బృందం రానుంది.
వేడెక్కిన జంతర్ మంతర్
రోహిత్ ఆత్మహత్య వెనక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ వివిధ విద్యార్థి సంఘాలు రెండోరోజూ ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగించాయి. దోషులపై తగిన చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళన ఉధృతమవుతుందని హెచ్చరించాయి. మంగళవారం ఉదయం ఇక్కడి జంతర్ మంతర్‌లో ఆప్ నేతలు, ఏఐఎస్‌ఏ విద్యార్థి సంఘం, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. సాయంత్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ వద్ద కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే కేంద్రం విద్యార్థులపై చర్యలు తీసుకుందని, సస్పెండ్ చేసేంతవరకూ కేంద్రం నుంచి ఒత్తిడి కొనసాగిందని ఆందోళనకారులు ఆరోపించారు.

కాగా, ప్రధాని మోదీ జోక్యం చేసుకొని స్మృతి  ఇరానీ, దత్తాత్రేయలను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఓ వ్యవస్థ అంతర్గత విషయాల్లో మంత్రి ఎలా జోక్యం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో స్మృతి ఇరానీ పాత్రపై కూడా విచారణ జరిపించాలని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు.
 
రాహుల్.. రాజకీయం చేయొద్దు: బీజేపీ
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ హత్యను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. రోహిత్ వెనకబడిన తరగతులకు చెందిన వాడని.. అనవసరంగా దళితుడని ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచుతున్నారని మండిపడింది. దళితుడైనందుకే బీఆర్ అంబేడ్కర్‌ను జీవితాంతం మనోవేదనకు గురిచేసిన విషయాన్ని రాహుల్ మరిచిపోయారా అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రశ్నించారు. కొన్ని వర్గాలు, కాంగ్రెస్, మీడియాలోని ఓ వర్గం రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

కోర్టు ఆలోచనల మేరకే రోహిత్‌తో పాటు ఐదుగురు విద్యార్థులపై వర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారని.. ఆ తర్వాత మానవతాధృక్పథంతో ఆలోచించి హాస్టల్‌లోకి అనుమతించకుండా.. క్లాసులకు అనుమతిచ్చారని మురళీధర్ రావు గుర్తుచేశారు. ఏదో జరిగిపోయినట్లు హడావుడిగా పర్యటించటం ద్వారా ఓ జాతీయ పార్టీ పరువును మరింత దిగజార్చారని విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయటం ద్వారా బురదలో చేపలు పట్టాలనుకుంటున్నారని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. రోహిత్ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం వల్లే గొడవ మొదలైందని.. ఈ ఆత్మహత్యను కొన్ని వర్గాలు దళితహత్యగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement