రూపాయి మరోసారి హై జంప్
ముంబై: ఒకవైపు దేశీయ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతుండగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రుపీ దూసుకుపోతోంది. రూ. 64 స్థాయిని తొలిసారి బ్రేక్ చేసి 0.48పైసల లాభంతో రూ.63.96 వద్ద రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే రూ. 63.93 వద్ద 20 నెలల గరిష్టాన్ని తాకి మరోసారి హైజంప్ చేసింది. ఆరంభంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 20 పైసలు(0.31 శాతం) బలపడింది. 64.07 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంతక్రితం రూపాయి 2015 ఆగస్ట్ 10న మాత్రమే 64.10 కంటే దిగువన నిలిచింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 17 పైసలు పుంజుకుని 64.27 వద్ద ముగిసింది.
కాగా దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల హైజంప్ చేయడంతోపాటు ఎగుమతి సంస్థలు, బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయికి బలమొచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ సంకేతాలతో రూపాయికి మంచి మద్దతు లభించినట్టు భావిస్తున్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఫ్యూచర్స్ లో మరింత బలహీనపడింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ. 305 నష్టపోయిన పుత్తడి రూ. 28,826 వద్ద వుంది.