మాస్కో: 2014-ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న రష్యాలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. ఉత్తర కౌకాసస్ ప్రాంతంలోని వోల్గోగ్రాడ్ నగరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వద్ద ఓ మహిళా ఆత్మాహుతి బాంబర్ ఆదివారం మధ్యాహ్నం తనను తాను పేల్చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా దాదాపు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్టు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ అధికారులు వెల్లడించారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. పేలుడు జరిగిన స్టేషన్‌కి వింటర్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న సోచి నగరం సమీపంలో ఉండడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కాగా, ఈ పేలుడు వెనుక ఉగ్రవాద చర్య ఉండి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.