సుజుకి కొత్త టూవీలర్లు
ముంబై: జపాన్ టూ-వీలర్ దిగ్గజం సుజుకి... సోమవారం రెండు కొత్త టూ-వీలర్లను ఆవిష్కరించింది. లెట్స్ పేరుతో ఒక స్కూటర్‌ను, జిక్సర్ పేరుతో కొత్త మోటార్ బైక్‌ను తెస్తున్నట్లు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా(ఎస్‌ఎంఐఎల్) ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. లెట్స్ స్కూటర్‌ను బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, జిక్సర్ బైక్‌ను హీరో సల్మాన్‌ఖాన్ ఆవిష్కరించారు. వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ టూవీలర్ల ధరలను వెల్లడిస్తామని, ఇతర కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా ధరలుంటాయని గుప్తా తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో రెండు కొత్త టూవీలర్లను అందిస్తామన్నారు. వచ్చే నెల నుంచి లెట్స్ స్కూటర్లను, జూలై నుంచి జిక్సర్ బైక్‌లను విక్రయిస్తామని చెప్పారు.
లెట్స్ స్కూటర్ ‘ 98 కేజీలు
ప్రస్తుతం మార్కెట్లో సుజుకి యాక్సెస్, స్విష్ ఉన్నాయి.
లెట్స్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు ఆయిల్-డాంప్‌డ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ట్యూబ్‌లెస్ టైర్లు, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. తక్కువ బరువుండే(98 కేజీలు) లెట్స్ 5 రంగుల్లో లభిస్తుంది.
సుజుకి ఈకో పెర్ఫామెన్స్ (సెప్) టెక్నాలజీతో రూపొందిన ఈ స్కూటర్ 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలియజేసింది.
జిక్సర్ బైక్ ప్రత్యేకతలు ఇవీ...
ఈ 150 సీసీ బైక్‌లో సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్‌ఓహెచ్‌సీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు మోనో షాక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ప్రత్యేకతలున్నాయి.
యమహా ఎఫ్‌జడ్, హోండా సీబీ ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీలకు ఈ కొత్త బైక్ గట్టి పోటీనివ్వగలదని సుజుకి భావిస్తోంది.