పాట్నా: ఉప్పు కేజీ రూ. 150. బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కేజీ ఉప్పును అమ్ముతున్న ధర ఇది. నిత్యావసరమైన ఉప్పుకు తీవ్ర కొరత రానుందన్న వదంతులే ఇలా ధర భారీగా పెరగడానికి కారణం. ఈ వందతులతో బీహార్‌లోని నాలుగు జిల్లాల్లోని ప్రజలు ఉప్పును కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. కాగా.. ఈ వదంతుల వ్యాప్తికి సంబంధించి బీహార్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఉప్పు వదంతులకు బీజేపీయే కారణమని బీహార్ ప్రభుత్వం ఆరోపించింది. జేడీయూ సర్కారును బలహీన పరచడమే లక్ష్యంగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించింది. బీహార్‌లోని దర్భందా, సీతామర్తి, సమస్తిపూర్, మధుబనీ జిల్లాల్లో ఉప్పుకు తీవ్ర కొరత రానుందంటూ కొద్ది రోజులుగా వదంతులు వ్యాపించాయి. గుజరాత్లో ఉప్పు దిగుబడి తగ్గినందున, బీహార్‌కు సరఫరా ఆగిపోతుందని ప్రచారం సాగింది. దీంతో ఉప్పు దొరకదేమో అనే ఆందోళనతో ప్రజలు షాపుల ముందు బారులు తీరారు.
దీంతో ఒక్క బుధవారం నాడే ఈ నాలుగు జిల్లాల్లో కేజీ ఉప్పును రూ.70 నుంచి రూ. 150 వరకూ అమ్మారు. దీంతో అధికారులు ఉప్పుకు ఎటువంటి కొరతా లేదని, ఆందోళన చెందవద్దని మైకుల్లో ప్రచారం చేయాల్సి వచ్చింది. ఉప్పుకు ఎటువంటి కొరతా లేదని, ఇవి ఒట్టి వదంతులే అని గురువారం బీహార్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్యామ్ రజాక్ చెప్పారు. వదంతులపై సంబంధిత జిల్లాల్లో విచారణ జరపాలని, ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని ఆయన ఆదేశించారు. ఉప్పు వదంతులకు సంబంధించి బీజేపీపై రజాక్ ఆరోపణలు గుప్పించారు. జేడీయూ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే ఇటువంటి పుకార్లను బీజేపీ సృష్టిస్తోందని, ఇందులో సంబంధం ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రజాక్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రతి చిన్న విషయానికీ బీజేపీపై ఆరోపణలు చేయడం జేడీయూకు అలవాటుగా మారిపోయిందని మండిపడింది.