సానియాకు డిజపాయింట్‌మెంట్!
మెల్‌బోర్న్: ఏడో మేజర్ టైటిల్ సాధించాలన్న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో సానియా- ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)జోడీకి పరాజయం ఎదురైంది. ఆదివారమిక్కడ జరిగిన ఫైనల్ పోరులో అన్ సీడెడ్ జోడీ అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా), యువాన్ సెబాస్టియన్ కబాల్ (కొలంబియా) చేతిలో సానియా జోడీ ఓడిపోయింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో సానియా జోడీ చేతులెత్తేసింది. దీంతో 6-2, 6-4 వరుస సెట్లలో ఓడిపోయింది.
సానియా ఇప్పటివరకు రెండోసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను సాధించింది. 2016లో మార్టినా హింగిస్‌తో కలిసి వుమెన్స్ డబుల్స్ టైటిల్‌ను, 2009లో మహేష్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఈసారి ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)ను భాగస్వామిగా ఎంచుకొని చక్కని పోరాటపటిమతో సానియా ఫైనల్‌కు చేరుకుంది.
గతంలో సానియా మహిళల డబుల్స్‌లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి వింబుల్డన్, యూఎస్ ఓపెన్ (2015లో), ఆస్ట్రే లియన్ ఓపెన్ (2016లో) టైటిల్స్‌ను ఒక్కోసారి గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మహేశ్ భూపతి భాగస్వామిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009లో), ఫ్రెంచ్ ఓపెన్ (2012లో)... బ్రూనో సోరెస్‌తో కలిసి యూఎస్ ఓపె్న్ (2014లో) టైటిల్స్‌ను ఒక్కోసారి కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. 2008లో మహేశ్ భూపతితో, 2014లో హోరియా టెకావ్ (రొమేనియా)తో కలిసి ఫైనల్‌కు చేరుకున్న సానియా రన్నరప్‌గా నిలిచింది.