ఏడో ‘గ్రాండ్’ టైటిల్‌కు అడుగు దూరంలో...
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సానియా–డోడిగ్ జంట
మెల్‌బోర్న్: తన డబుల్స్ కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్‌ను రెండోసారి సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి సానియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా–డోడిగ్ ద్వయం 6–4, 2–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో సామ్ గ్రోత్–సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో అన్ సీడెడ్ జోడీ అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)–యువాన్ సెబాస్టియన్ కబాల్ (కొలంబియా)తో సానియా–డోడిగ్ జంట తలపడుతుంది.
గ్రోత్–స్టోసుర్‌తో 78 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్‌ను నెగ్గిన సానియా జంట రెండో సెట్‌లో తడబడింది. తమ సర్వీస్‌లను రెండుసార్లు కోల్పోయి సెట్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జోడీ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సానియా జోడీ నాలుగు ఏస్‌లు సంధించి, కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసింది.
గతంలో సానియా మహిళల డబుల్స్‌లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి వింబుల్డన్ , యూఎస్ ఓపెన్ (2015లో), ఆస్ట్రే లియన్ ఓపెన్ (2016లో) టైటిల్స్‌ను ఒక్కోసారి గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మహేశ్ భూపతి భాగస్వామిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009లో), ఫ్రెంచ్ ఓపెన్ (2012లో)... బ్రూనో సోరెస్‌తో కలిసి యూఎస్ ఓపె్న్ (2014లో) టైటిల్స్‌ను ఒక్కోసారి కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. 2008లో మహేశ్ భూపతితో, 2014లో హోరియా టెకావ్ (రొమేనియా)తో కలిసి ఫైనల్‌కు చేరుకున్న సానియా రన్నరప్‌గా నిలిచింది.