
పంచాయతీల నిధుల్ని లాక్కోవడమా?
సర్పంచ్‌లతో కలసి ఉద్యమిస్తాం: వైఎస్సార్‌సీపీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను గుంజేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాల్సిన పనుల్ని సొంత పార్టీ కార్యకర్తలు, నేతలతో చేయించడానికే రూ.500 కోట్ల పంచాయతీల నిధుల్ని మళ్లించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఈ ప్రయత్నాల్ని మానుకోకపోతే గ్రామ సర్పంచులను, స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల సంఘాలను ఏకం చేసి కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.