అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధపడుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతోపాటు ఆమె నెచ్చెలి అయిన శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి త్వరగా బయటపడితే.. సీఎం పదవి చేపట్టేందుకు తనకు లైన్ క్లియర్ అవుతుందని శశికళ భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ అవకాశాలు లేవని తాజా పరిణామాలు చాటుతున్నాయి.
ఈ కేసు నుంచి జయలలిత పేరును తొలగించాలని తాజాగా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయపరమైన అంశం కావడంతో కర్ణాటక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించే అవకాశముంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యమయ్యే అవకాశముంది. దీంతో సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది.
అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్ చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును కొట్టేసింది. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, శుక్రవారం ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో వచ్చేవారం తీర్పు రావొచ్చునని భావిస్తున్నారు.