సౌదీ మహిళలు ఏంచేశారో తెలుసా?
సౌదీ అరేబియాలో మహిళలపై ఆంక్షలు ఎక్కువ. బయటకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు తమ ముసుగు తొలగనివ్వకూడదు. కానీ.. తాజాగా ఐదుగురు సౌదీ మహిళలు మాత్రం వీధిలో స్కేట్ బోర్డుల మీద తిరుగుతూ కేవలం ముఖాన్ని, జుట్టును మాత్రమే కప్పి ఉంచేలా.. మిగిలిన రంగురంగు దుస్తులన్నీ కనిపించేలా డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఓ వీడియో పెట్టారు. ప్రస్తుతం అది ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యింది. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా చూసిన ఆ వీడియో సౌదీ సమాజంలో మహిళల పాత్రపై చర్చ రేకెత్తించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను రెండు వారాల క్రితం అప్‌లోడ్ చేశారు.
ఎయిటీస్ సంస్థ తరఫున మాజీద్ అల్ ఎస్సా దర్శకత్వంలో వచ్చిన ఈ వీడియోలో అమ్మాయిలు ముగ్గురూ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటారు. సంప్రదాయ సౌదీ దుస్తుల్లో ఉండే ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ వీళ్లను చూస్తూ ఉంటారు. అయితే వాళ్లు చెప్పే విషయాన్ని అమ్మాయిలు ఏమాత్రం లెక్కచేయరు.
సోషల్ మీడియాలో మాత్రం చాలామంది దీనికి పాజిటివ్‌గానే కామెంట్లు పెట్టారు. డజన్ల కొద్దీ సౌదీ మహిళలు ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. సౌదీ యువరాజు మాజీ భార్య అమీరా అల్ తవీల్ చాలా కాలంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆమెకు ట్విట్టర్లో 14 లక్షల మంది ఫాలోవర్లుండగా, ఆమె కూడా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. సౌదీలో ఉన్న పితృస్వామ్య వ్యవస్థ మీద చాలాకాలంగా హక్కుల కార్యకర్తలు పోరాడుతున్నారు. ప్రయాణాలు, పెళ్లి, కాలేజీకి వెళ్లడం లాంటి విషయాల్లో పురుషుల అనుమతి లేకుండా నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉండాలని కోరుతున్నారు.