
ఆమెను విడుదల చేయండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రేమ పెళ్లి చేసుకున్న 19 ఏళ్ల యువతికి అత్యున్నత న్యాయస్థానం అండగా నిలిచింది. తన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ యువతికి ఉందని, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆమెకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. నిర్బంధం నుంచి ఆమెకు విముక్తి కల్పించాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.
తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న యువతిని జైపూర్ లోని నారీనికేతన్ లో ఉంచాలని గతంలో రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆమె మైనర్ అని తల్లిదండ్రులు పేర్కొనడంతో ఈ ఆదేశాలిచ్చింది. ఘజియాబాద్ కు చెందిన ఆమె భర్త సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. తన భార్య మైనర్ కాదని నిరూపించడంతో ఆమెను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరిద్దరూ జూన్ 16న ప్రేమ వివాహం చేసుకున్నారు.