మాలేగావ్ పేలుళ్ల భీతావాహ దృశ్యాలు (ఫైల్)
- మాలేగావ్ పేలుళ్ల విచారణపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రంపై పీపీ ఆరోపణ
- ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తాఖీదులు
న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో నరేంద్ర మోదీ సర్కార్, జాతీయ దర్యాప్తు సంస్థల తీరును సుప్రీంకోర్టు గర్హించింది. విచారణలో ఉదాసీనంగా ఉండాలంటూ బాధితుల తరఫున వాదనలు వినిపిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ పై ఒత్తిడి తేవడాన్ని తప్పుపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రం, ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం నోటీసులు జారీచేసింది.
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలను చేపట్టిన తరువాత మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో ఉదాసీనంగా వ్యవహరించాల్సిందిగా జాతీయ దర్యాప్తు అధికారుల నుంచి తాను ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని స్పెషల్ పిపి రోహిణి సాలియన్ గత జూన్ లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వెంటనే కల్పించుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాలతో కలిసి సామాజిక వేత్త హర్ష్ మందిర్ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.
2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ముస్లింలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘాతుకంలో ఎనిమిది మంది అమాయకులు చనిపోగా, 80 మంది గాయపడిన సంగతి తెలిసిందే. హిందూ అతివాద సంస్థలే ఈ పేలుళ్లు జరిపాయనే విషయం వెలుగులోకి రావడంతో 'కషాయ ఉగ్రవాదం' అనే పదం పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.