special public prosecutor
-
రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీగా వైకే
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసిస్టెంట్ స్పెషల్ పీపీగా మరో ప్రముఖ న్యాయవాది మల్లిఖార్జునరావును నియమించింది. గుంటూరులో కేసు విచారణ జరుగుతున్న పోక్సో కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ఈనెల 15న విచారణ జరగనుంది. కేసులో తమను స్పెషల్ పీపీ, ఏపీపీగా నియమిస్తూ జీవో 364 ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ద్వారా కోర్టుకు, న్యాయవాదులకు చేరుకోవడంలో జాప్యం జరిగినట్లు వైకే సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఏప్రిల్ ఏడోతేదీన విడుదల చేసిన ఉత్తర్వులు ఈఏడాది జూన్ 28న అందజేసినట్లు చెప్పారు. ఈలోగా కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్ సాక్షుల నుంచి కోర్టులో వాంగ్మూలాలను రికార్డు చేయడం పూర్తయిందని, నిందితుల తరఫున డిఫెన్స్ సాక్ష్యం నమోదు దశకు చేరుకుందని తెలిపారు. ఈనెల ఒకటో తేదీన కోర్టు వాయిదాకు హాజరైన స్పెషల్ పీపీ వైకే, ఏపీపీ మల్లిఖార్జునరావు కోర్టుకు హాజరై ప్రాసిక్యూషన్ నిర్వహణకు సంసిద్ధత తెలియజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని న్యాయాధికారికి అందజేశారు. ఇప్పటివరకు కేసులో జరిగిన పురోగతిని, సాక్షుల వాంగ్మూలాన్ని నమోదుచేసిన పత్రాలతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసి ప్రాసిక్యూషన్‌ను చట్టపరమైన పద్ధతిలో నిర్వహిస్తామని కోర్టుకు వైకే విన్నవించారు. నిందితుల తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు కేసును ఈనెల 15కు వాయిదా వేశారని వైకే తెలిపారు. ఈ కేసులో నాటి ఏఎన్‌యూ బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, ముగ్గురు బీఆర్క్ విద్యార్థులు నిందితులని చెప్పారు. (క్లిక్: తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..) -
మోదీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
- మాలేగావ్ పేలుళ్ల విచారణపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రంపై పీపీ ఆరోపణ - ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తాఖీదులు న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో నరేంద్ర మోదీ సర్కార్, జాతీయ దర్యాప్తు సంస్థల తీరును సుప్రీంకోర్టు గర్హించింది. విచారణలో ఉదాసీనంగా ఉండాలంటూ బాధితుల తరఫున వాదనలు వినిపిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ పై ఒత్తిడి తేవడాన్ని తప్పుపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రం, ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలను చేపట్టిన తరువాత మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో ఉదాసీనంగా వ్యవహరించాల్సిందిగా జాతీయ దర్యాప్తు అధికారుల నుంచి తాను ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని స్పెషల్ పిపి రోహిణి సాలియన్ గత జూన్ లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వెంటనే కల్పించుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాలతో కలిసి సామాజిక వేత్త హర్ష్ మందిర్ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ముస్లింలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘాతుకంలో ఎనిమిది మంది అమాయకులు చనిపోగా, 80 మంది గాయపడిన సంగతి తెలిసిందే. హిందూ అతివాద సంస్థలే ఈ పేలుళ్లు జరిపాయనే విషయం వెలుగులోకి రావడంతో 'కషాయ ఉగ్రవాదం' అనే పదం పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.