శాస్త్రీయంగా ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విభజనపైన కూడా శాస్త్రీయమైన, హేతుబద్ధమైన విధానాలను పాటించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.హనుమంతునాయక్ మంత్రుల బృందాని(జీఓఎం)కి అందజేసిన నివేదికలో విజ్ఞప్తి చేశారు. సర్వీసు రిజిస్టర్‌లో నమోదైన సొంత జిల్లా ఆధారంగా అధికారులను విభజనానంతరం ఆయా రాష్ట్రాలకు పంపించాలని సూచించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు జీఓఎంకు సమర్పించిన నివేదిక గురించి వివరించారు.
రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్ స్థాయి పోస్టులలో ప్రస్తుతం 20 నుంచి 30 శాతం స్థానికేతరులు ఉన్నారని వారినందరినీ సర్వీసు రిజిస్టర్‌లో పేర్కొన్న సొంత జిల్లాల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు పంపించాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న గ్రూప్-1 ఉద్యోగాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్డీఓ, డీఎస్పీ, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్, జాయింట్ కమిషనర్ వంటి అధికారులను కూడా సర్వీసు రిజిస్టర్‌లో నమోదైన జిల్లా ఆధారంగా పంపించాలన్నారు.
తెలంగాణకు బదిలీ చేయండి : ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విభజనానంతరం ‘ఇన్‌సైడర్’ కోటా కింద తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరారు. ముల్కీ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకొని ‘తెలంగాణ వాసి’ని నిర్వచించాలని, తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత కూడా 371-డి అధికరణను కొనసాగించాలని, తాత్కాలిక ఉమ్మడి రాజధాని కాలపరిమితిని 10 సంవత్సరాల నుంచి 3 ఏళ్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేందుకు ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా, రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు సభ్యులుగా ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఉద్యోగుల విభజనపై కేంద్రం నిర్దిష్టమైన మార్గదర్శకాలను వెల్లడించాలని చంద్రశేఖర్‌గౌడ్, హనుమంతునాయక్ కోరారు.